May 25,2023 22:16

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎస్పీ శ్రీనివాసరావు

         ప్రజాశక్తి-కళ్యాణదుర్గం   ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసు అధికారులు చిత్తశుద్ధితో పని చేసి, వారి మన్ననలు పొందాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. పట్టణంలోని శ్రీనివాస కల్యాణ మండపంలో గురువారం డీఎస్పీ బి.శ్రీనివాసులు అధ్యక్షతన కళ్యాణదుర్గం పోలీసు సబ్‌ డివిజన్‌ పరిధిలోని పోలీసు బ్బందితో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీసుల విధులు, బాధ్యతలను గుర్తుచేశారు. సమాజంలో పోలీసులంటే ఓ రకమైన అభిప్రాయం ఉందన్నారు. కావున ప్రతి పోలీసు అధికారి ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసినప్పుడే ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ప్రజలకు న్యాయం చేసినప్పుడే వృత్తికి న్యాయం చేసిన వారవుతారన్నారు. అసాంఘిక కార్యక్రమాలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడంతో పాటు అవాంఛనీయ ఘటనలను ఎప్పటికప్పుడు ప్రతిఘటించాలన్నారు. గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు చెలరేగకుండా ప్రత్యేక భద్రత వహించాన్నారు. కార్యక్రమంలో సీఐలు తేజోమూర్తి, శ్రీనివాసులు, లక్ష్మన్న, యుగంధర్‌, ఎస్‌ఐలు మధు, అనిత, ఆశాబేగం, రాజేష్‌, యువరాజు, శివ, పరశురాముడు, తదితరులు పాల్గొన్నారు.