
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: విద్యార్థుల్లో శాంతి సౌబ్రాతృత్వం పెంపొందించడానికి లయన్స్ హర్షవల్లి చేస్తున్న కృషి ప్రశంసనీయమని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న స్విమ్మింగ్ ఫూల్ ఆవరణంలో లయన్స్ క్లబ్ హర్షవల్లి ఆధ్వర్యాన శనివారం చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ప్రారంభించిన ఆయన పిల్లల్లో చిత్రకళ నైపుణ్యాన్ని పెంపొందించేందుకు శాంతి సందేశాన్ని ప్రపంచానికి అందచేయాలన్న సంకల్పం గొప్పదన్నారు. ఈ పోటీల్లో వివిధ స్కూళ్ల విద్యార్థులు ఉత్సహంగా పాల్గొని ప్రపంచ శాంతి అనే అంశంపై చిత్రాలను వేశారు. లయన్స్ క్లబ్ హర్షవల్లి అధ్యక్షులు కరణం శోభారాణి మాట్లాడుతూ తమ క్లబ్ ద్వారా సేవ కార్యక్రమాలు సమాజానికి పనికొచ్చే విధంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులను ప్రోత్సహించడానికి వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పిల్లల్లో సృజనాత్మకత శక్తిని పెంపొందించడానికి ఈ పోటీలు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ హర్షవల్లి వ్యవస్థాపక అధ్యక్షులు హారికాప్రసాద్, జిల్లా పర్యాటక అధికారి నడిమింటి నారాయణరావు మెప్మా పీడీ కిరణ్‌కుమార్, లయన్స్ ప్రతినిధులు వావిలపల్లి జగన్నాథం నాయుడు, తర్లాడ అప్పలనాయుడు, వాకర్స్ క్లబ్ అధ్యక్షులు శాసపు జోగినాయుడు, రౌతు శ్రీనివాసరావు గణపతి, పద్మజ, మణిశర్మ పాల్గొన్నారు.