Apr 17,2023 22:30

పవర్‌ ప్రాజెక్టు

       అనంతపురం ప్రతినిధి : అదానీ సంస్థలపై దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున దుమారం రేగుతున్నా రాష్ట్రంలో మాత్రం ఆయన సంస్థ పవర్‌ ప్రాజెక్టుల విషయంలో మాత్రం ముందుకే వెలుతోంది. చిత్రావతి ప్రాజెక్టుపై పంప్డు స్టోరేజీ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆ సంస్థకు ముందుకెళుతున్నట్టే కనిపిస్తోంది. 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో ఇక్కడ పంప్డు స్టోరేజీ పవర్‌ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే మంజూరు చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. మంత్రివర్గ సమావేశంలో ఆ సంస్థ ఏర్పాటుకు 400 ఎకరాల వరకు భూమిని కేటాయిస్తూ నిర్ణయం సైతం చేసింది. దీనిపై అప్పట్లో విమర్శలు సైతం వెల్లువెత్తాయి. అయినా అదానీ పంప్డు స్టోరేజీ ప్రాజెక్టు పనలు మాత్రం జిల్లాలో ముందుకు సాగుతున్నట్లు కన్పిస్తున్నాయి.
అదానీ సంస్థపై ప్రపంచ వ్యాప్తంగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో భూములను ఆసంస్థకు కేటాయించడం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. విమర్శలు ఎన్ని వచ్చిన అదానీకి కేటాయింపులు మాత్రం తగ్గలేదు. అనుమతులన్ని లభించి ఉండటంతో అదానీ ఎనర్జీ చిత్రావతిపై 500 మెగావాట్ల సామర్థ్యంతో పంప్టు స్టోరేజీ పవర్‌ప్లాంటు ఏర్పాటుకు సిద్ధపడుతోంది. దీనికి అవసరమైన పర్యావరణ అనుమతులకై మే మొదటి వారంలో పర్యావరణ అనుమతులకై కాలుష్య నియంత్రణా మండలి ఆధ్వర్యంలో పబ్లిక్‌ హియరింగ్‌ జరిగే అవకాశాలున్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టులు నాలుగింటిని రాష్ట్ర ప్రభుత్వం అదానీ సంస్థకు కట్టబెట్టింది. అందులో చిత్రావతి ఒకటి కాగా, గండికోటపై వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో మరో ప్రాజెక్టుకు అనుమతినిచ్చింది. ఇప్పుడు చిత్రావతిపై నిర్మంచబోయే ప్రాజెక్టు పనులు పురోగతిలోనున్నట్టు తెలుస్తోంది. అటు సోలార్‌, ఇటు హైడ్రో పద్ధతిలో రెండింటి ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి ఈ ప్రాజెక్టు ద్వారా చేపట్టాలన్నది లక్ష్యం. ఇక్కడ కేటాయించిన భూమి మొత్తం ప్రభుత్వ భూమియే ఉన్నట్టు సమాచారం. ఎకరానికి ఐదు లక్షల రూపాయల చొప్పున భూ కేటాయింపులు జరిపేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు సమాచారం.
సోలార్‌ ఎనర్జీ పనులపై వెనక్కు తగ్గారా..?
అదానీ సంస్థ అనంతపురం జిల్లా పరిధిలోని రాయదుర్గం ప్రాంతంలో ఏర్పాటు చేయతలపెట్టిన సోలార్‌ ఎనర్జీపై కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. మొదట 15 వేల ఎకరాల్లో సోలార్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రచారం సాగింది. ఈ మేరకు గ్రామాల వారీగా భూసేకరణకు అవసరమైన కసరత్తును జిల్లా నెడ్‌క్యాప్‌ సంస్థ చేపట్టింది. అదానీ సంస్థపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రైతుల్లోనూ అయోమయం, గందరగోళం నెలకొంది. భూములు ఇచ్చాక ఏడాదికి ఇస్తామన్న లీజు ఇస్తారా లేదా అన్న సందేహాలు సైతం వ్యక్తయ్యాయి. ఈ నేపథ్యంలో అదానీ సంస్థ కూడా సోలార్‌ ప్రాజెక్టు ఏర్పాటుపై కాస్త వెనక్కు తగ్గినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం రాయదుర్గం ప్రాంతంలో ఏర్పాటు చేసే సోలార్‌ ప్లాంట్‌ మాత్రం 7500 ఎకరాలకే పరిమితమయ్యేందుకు సిద్ధపడినట్టు సమాచారం. ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. అయితే ఏర్పాటు పనుల్లో మాత్రం ఆ సంస్థ నిమగమై ఉంది. ఏది ఏమైనా ఉమ్మడి అనంతపురం జిల్లాలో అదానీ సంస్థ చిన్న చిన్నగా పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తును కొనసాగిస్తూపోతూనే ఉంది. ఈ ప్రాజెక్టులను 2028 నాటికి పూర్తి చేసే లక్ష్యంతో ముందుకెలుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం కూడా అందుకు అవసరమైన తోడ్పాటు, సహకారాన్ని అందించే విధంగా చర్యలు చేపడుతూపోతోంది.