చిరుతని చంపిన వేటగాళ్ల అరెస్టు
శ్రీ చిరుతపులి ఎముకలు,
దుప్పి కొమ్ములు స్వాధీనం
శ్రీ రెండు నాటు తుపాకులు,
ద్విచక్ర వాహనాలు సీజ్
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్:
చిరుతపులిని వేటాడి చంపిన ఐదుగురు వేటగాళ్లను జిల్లా అటవీ శాఖాధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు చిత్తూరు జిల్లా డిఎఫ్‌ఓ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు. మంగళవారం చిత్తూరు జిల్లా అటవీశాఖ పశ్చిమ విభాగం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎఫ్‌ఓ నిందితులను చూపి వివరాలను వెల్లడించారు. యాదమరి మండలం దిగువ కణతల చెరువు గ్రామానికి చెందిన గంగాధరం (31), చిత్తూరు రూరల్ మండలం మర్రిగుంత గ్రామానికి చెందిన ధనశేఖర్ (27), తోప్పాతిపల్లికి చెందిన మధుసూదన్ (30), అనే ముగ్గురు నిందితులు కలిసి గుడిపాల మండలం చుక్కావారిపల్లికి చెందిన బాసు (21), యాదమరి మండలం గొందివాళ్ళఊరుకు చెందిన రుద్రన్ అనే వ్యక్తుల వద్ద రూ.5వేల నుంచి రూ.15 వేల వరకు వెచ్చించి రెండు సంవత్సరాల క్రితం నాటు తుపాకులు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఈ తుపాకులతో యాదమరి మండలంలోని కీనాటంపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో రెండేళ్లక్రితం వేటకువెళ్లి చిరుతపులిని చంపి వాటి కాలిగోళ్లను పంచుకున్నారని వెల్లడించారు. పులి కళేబరాన్ని మాత్రం క్వారీ లోయలో పడేసి వెళ్లిపోయారన్నారు. ఈ క్రమంలో మధుసూదన్ అప్పట్లో తాను నాటు తుపాకితో చంపిన చిరుత పులితో ఫోటో దిగాడన్నారు. సంబంధిత ఫోటో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన నేపథ్యంలో... ఆఫోటో ఆధారంగా రెండేళ్ల క్రితం చంపబడ్డ చిరుతపులి వివరాలను ఛేదించగలిగామన్నారు. అందులో భాగంగా బాధ్యులైన నిందితులు 5 మందిని అరెస్ట్‌చేసి, వారి వద్ద నుంచి పులిగోరు, ఎముకలు, ఇతర అవశేషాలు, దుప్పి కొమ్ములు, ఒక మచ్చు కత్తి, రెండు నాటు తుపాకీలు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసామన్నారు నిందితులను కోర్టుకు హాజరు పరచనున్నట్లు తెలిపారు. వన్యప్రాణులను వేటాడడం నిషేధమని, అందుకు విరుద్ధంగా ఎవరైనా వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వేటగాళ్లు, నాటు తుపాకులు ఉన్న వారి వివరాలను అటవీశాఖ ఉద్యోగులకు గాని, స్థానిక పోలీసులకు గాని తెలియజేయాలని కోరారు. అలా వివరాలు తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. సమావేశంలో ఎఫ్‌ఆర్‌ఓ బాలకష్ణారెడ్డి, డివైఅర్‌ఓ స్వప్నకుమారి, ఎఫ్‌ఎస్‌ఓ హరికుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు రెడ్డిప్రసాద్, గణేష్ బాబు, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.










