Apr 28,2023 21:57

చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ గౌతమి

        అనంతపురం కలెక్టరేట్‌ : ఆరోగ్యకరమైన జీవితానికి అవసరమైన పోషకాలు అందించే సిరి ధాన్యాలు చిరుధాన్యాలు అని కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి తెలిపారు. శుక్రవారం నాడు పంగల్‌ రోడ్డు వద్దనున్న టీటీడీసీలో మిల్లెట్‌ మహోత్సవ్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌ మాట్లాడుతూ భారతదేశం చిరుధాన్యాల పుట్టినిల్లు అన్నారు. చిరుధాన్యాలకు ప్రజలు దూరం కావడం వల్ల ప్రతి పదిమందిలో నలుగురు బీపీ, షుగర్‌లతో బాధపడే పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో కంటే ఎక్కువగా రక్తహీనత నేడు మహిళల్లో కనిపిస్తోందని చెప్పారు. ఈ సమస్యలకు చిరుధాన్యాలే పరిష్కారమన్నారు. ప్రజలు వారంలో ఒకరోజు 'మిల్లెట్‌ డే'గా కేటాయించుకుని కేవలం చిరుధాన్యాలతో తయారు చేసిన వంటకాలను మాత్రమే తినడం అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం మిల్లెట్‌ మహోత్సవ్‌లోని స్టాళ్లలో చిరుధాన్యాలతో చేసిన ఆహారపదార్థాలను పరిశీలించారు. మూడున్నర ఎకరాల్లో 8 క్వింటాళ్ల అండుకొర్రలు పండించిన రైతు రాజశేఖర్‌ రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నరసింహా రెడ్డి, డీపీఎం లక్ష్మా నాయక్‌, ఎల్డీఎం నాగరాజ రెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి నాగరాజ రావు, ఐసీడీఎస్‌ పీడీ శ్రీదేవి, శాస్త్రవేత్తలు సహదేవ రెడ్డి, పద్మలత పాల్గొన్నారు.