Aug 18,2023 21:24

జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు

      అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించింలా వ్యవసాయ అధికారులు అన్ని రకాల చర్యలూ తీసుకోవాలని ఎంపీ తలారి రంగయ్య, అగ్రి అడ్వయిజరీ బోర్డ్‌ ఛైర్మన్‌ టి.రాజశేఖర్‌ రెడ్డి సూచించారు. శుక్రవారం నాడు కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, కలెక్టర్‌ ఎం.గౌతమి, జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, డిసిసిబి బ్యాంక్‌ ఛైర్‌పర్సన్‌ లిఖిత, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్రి అడ్వయిజరీ బోర్డ్‌ ఛైర్మన్‌ టి.రాజశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ఆర్‌బికెల పరిధిలో చిరుధాన్యాలను రాయితీతో ఇవ్వాలన్నారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ సరఫరా అర్ధరాత్రి కాకుండా పగటిపూట సక్రమంగా ఇవ్వాలన్నారు. చీనీ పంట విక్రయాల్లో రైతు నష్టపోకుండా కమిషన్‌ కాకుండా తీసుకునే సూట్‌ విక్రయాలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ చిరుధాన్యాల సాగును మరింత పెంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకతి సేద్యం చేసుకునేందుకు ఎస్సీ, ఎస్టీ రైతులకు అవసరమైన విత్తనాలను సరఫరా చేస్తోందని, రైతులు దానిని సద్వినియోగం చేసుకునేలా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్‌ గౌతమి మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు అనునిత్యం అప్రమత్తంగా ఉండి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. సీజన్లో ఈ క్రాఫ్‌ బుకింగ్‌ పక్కాగా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధం శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.