జిల్లా కలెక్టర్ ప్రశాంతి
ప్రజాశక్తి - భీమవరం
మహాత్మా జ్యోతిరావు పూలే జాతికి చేసిన సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అన్నారు. జ్యోతిరావు పూలే 197వ జయంతిని మంగళవారం కలెక్టరేట్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ నివాళులర్పించి మాట్లాడారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కృషిచేసిన జ్యోతిరావు పూలే గొప్ప మహనీయుడని కొనియాడారు. బాలికా విద్యకు ఆయన ఎంతో ప్రాధాన్యతిచ్చారని తెలిపారు. బాలికల కోసం, వెనుకబడిన వర్గాల కోసం పాఠశాలలు స్థాపించారని చెప్పారు. ఇన్‌ఛార్జి జెసి, నరసాపురం సబ్ కలెక్టర్ ఎం.సూర్యతేజ మాట్లాడుతూ అప్పటి సామాజిక రాజకీయ పరిస్థితుల్లో తన భార్యకు విద్యనేర్పించి దేశంలో మహిళల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించిన గొప్ప వ్యక్తిని అన్నారు. రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్ గుబ్బల తమ్మయ్య మాట్లాడుతూ జ్యోతిరావుపూలే సేవలు చిరస్మరణీయమన్నారు. డిఆర్‌ఒ కె.కృష్ణవేణి మాట్లాడుతూ సమాజంలో ఉన్న అసమానతలపై ఆయన ఎంతో పోరాటం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఒ దాసి రాజు, జిల్లా బిసి సంక్షేమాధికారి గణపతిరావు, జిల్లా అధికారులు, బిసి సంఘాల నాయకులు పాల్గొన్నారు.










