Aug 23,2023 23:01

టంగుటూరి ప్రకాశం పంతులుకు నివాళులు అర్పిస్తున్న కలెక్టర్‌ గౌతమి

       అనంతపురం కలెక్టరేట్‌:స్వాతంత్య్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు చిరస్మరణీయులని కలెక్టర్‌ ఎం.గౌతమి తెలిపారు. అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పలువురు అధికారులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రకాశం పంతులు 1928లో మద్రాసులో సైమన్‌ కమిషన్‌ బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని తుపాకీకి ఎదురు నిలిచి కాల్చమని సవాలు చేశారని తెలిపారు. ఆయన ధైర్య సాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయనకు ఆంధ్ర కేసరి అనే బిరుదును ఇచ్చి గౌరవించారన్నారు. 1953 అక్టోబర్‌ 1న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు ఎన్నిక అయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ కుషాల్‌ జైన్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఆనంద్‌, బీసీ వెల్ఫేర్‌ డిడి కుష్బు కొఠారి, బీసీ కార్పొరేషన్‌ ఈడీ సుబ్రమణ్యం, కలెక్టరేట్‌ కోఆర్డినేషన్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ పుణ్యవతి, ఏవో శ్రీధర్‌, బీసీ వెల్ఫేర్‌, కార్పొరేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయంలో..
సుప్రసిద్ధ స్వాతంత్య్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు చిరస్మరణీయులని జిల్లా గ్రంథాలయ కార్యదర్శి పి.రమా అన్నారు. బుధవారం జిల్లా గ్రంథాలయ కార్యాలయంలో స్వాతంత్య్ర సమర యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్యదర్శి రమా మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు భారతదేశానికి చేసిన సేవలు మరువలేని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌, జిఎం.బాషా, శ్రీవిజయ, సరస్వతి, బాలచంద్ర, మల్లి, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.
పోలీసు కాన్ఫిరెన్స్‌ హాల్లో...
అనంతపురం క్రైం : దేశం, ప్రజల కోసం నిరంతరం శ్రమించిన యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని ఎస్పీ కె.శ్రీనివాసరావు తెలిపారు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్య్ర సమర యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి పురస్కరించుకుని బుధవారం స్థానిక పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఆర్‌.విజయభాస్కర్‌ రెడ్డి, జి.రామకష్ణ, డీఎస్పీలు ఎం.ఆంథోనప్ప, జి.ప్రసాదరెడ్డి, యు.నరసింగప్ప, బి.శ్రీనివాసులు, మునిరాజ్‌, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడ్హాక్‌ కమిటీ సభ్యులు సాకే త్రిలోకనాథ్‌, సుధాకర్‌ రెడ్డి, తేజ్‌ పాల్‌ తదితరులు పాల్గొన్నారు.