చినుకుపడితే చిత్తడే..
ఖాళీ స్థలాల్లో వర్షపు నీటి నిల్వలు
దోమలతో ప్రజలు బెంబేలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
చినుకుపడితే చిత్తూరు చిత్తడి.. చిత్తడిగా.. మారుతోంది. ఎప్పుడో మున్సిపాటిలో ఏర్పడిన నాటి మురుగునీటి కాలువలు నేటికీ కంపుకొడుతున్నాయి. చిత్తూరువాసుల అండర్ డ్రైనేజీ కళగానే మిగిలింది. నగరం విస్తరించడంతో పలు కాలనీల్లో ఖాళీస్థలాల్లో వర్షపు నీటినిల్వలతో దోమలు వృద్ధిచెంది ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. మరోవైపు రోగాల భారిన పడేలా చేస్తున్నాయి. నగర పాలక సంస్థ అధికారులు పదే..పదే.. ఖాళీ స్థలాల యజమానులకు నోటిసులు జారీ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. కొన్ని కాలనీల్లో ఖాళీస్థలాల యజమానులు గుర్తింపు వార్డు కార్యదర్శులు అష్టకష్టాలు పడుతున్నారు. ఫలితంగా చుట్టు పక్కల ఉన్న గృహాల సముదాయం దోమల వృద్ధితో అల్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. అభివృద్ధి జపం చేస్తున్న అధికారులు చిత్తూరు నగరంలో మురుగునీటి కాలువల నిర్మాణం, దోమల వృద్ధిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
చినుకుపడితే చిత్తడే...
చిత్తూరు నగరంలో ప్రధాన వీధులు చిత్తడి..చిత్తడిగా మారుతున్నాయి. జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలోని ప్రధాన వీధులు చర్చవీధి, పొన్నిమ్మ గుడి, డిఐరోడ్లు వర్షపు నీటితో నిండిపోతున్నాయి. మోకాలిలోతులో వృద్ధులు, చిన్నారు, విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వర్షపునీటితో కలసిన మురుగునీటిలోనే ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది. ఎంఎస్‌ఆర్ సర్కిల్‌లో తరచూ మురుగునీటి కాలువ బ్లాక్ అవ్వడం ద్వారా రోడ్డుపై దుర్గందభరితమైన వర్షపునీటితో కలసిన మురుగునీరు రోడ్లుపై ప్రవహిస్తుండటంతో మురుగునీటిలోనే ప్రజలు ప్రయాణం సాగించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపడంతో నగరపాలక సంస్థ అధికారులు విఫలం కావడంతో చిన్నపాటి వర్షానికి రోడ్లుపై ప్రవహించే మురుగునీటిలో ప్రజలు ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది. ఎక్కడ నాలా ఉందో..? ఎక్కడ రోడ్డు ఉందో తెలియక ప్రమాదాలకు గురౌతున్నరు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు రోడ్లుపై మురుగునీరు ప్రవహించకుండా చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు.
ఖాళీ స్థలాల సమస్య..
నగరం రోజురోజుకీ విస్తరిస్తోంది. కొత్త కాలనీలు పుట్టుకొస్తున్నాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షపునీరు, మురుగునీరు ఖాళీస్థలాల్లో చేరి దోమల వృద్ధికి కారణం అవుతున్నాయి. నెలల తరబడీ మురుగునీరు ఖాళీస్థలాల్లో ఉండిపోవడంతో ప్రజలు దోమల భారినపడి డెంగ్యు, మలేరియా, వంటి విషజ్వరాల భారినపడుతున్నారు. అంతే కాకుండా ఖాళీస్థలాల్లో పిచ్చిమొక్కలు పెరిగి విషసర్పాలు, క్రిమికీటకాలకు ఆవాసాలుగా మారుతున్నాయి. ఖాళీస్థలాలు శుభ్రం చేయాలని నగర పాలక సంస్థ అనేకసార్లు యజమానులకు నోటీసులు పంపిణీ ఫలితం శున్యం. ప్రజారోగ్యం రిత్యా ప్రభుత్వ, రిజర్వు స్థలాలను నగర పాలకసంస్థ శుభ్రంచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి. లొతట్టు ప్రాంతాల్లో మట్టిని చదును చేయాలి. దోమల నివారణకు లార్వాలు చనిపోయేలా నీటినిల్వ ఉన్న చోట గంబూషియా చేపలు విడిచిపెట్టాలి, అయిల్‌బాల్స్ వేయాలి. రసాయనాలు వెదజల్లాలి. అలాగే ప్రయివేటు స్థలాల యజమానులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేయాలి. ఖాళీ స్థలాల పన్నులు విధించాలి. యజమానులు ఖాళీ స్థలాలను శుభ్రంగా ఉంచుకొనేలా చూడాలి.
సమస్యల పరిష్కారానికి చర్యలు
- డాక్టర్ అరుణ, నగర కమిషనర్
నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్థవ్యస్థంగానే ఉన్న మాట వాస్తవమే. అండర్‌డ్రైనేజీ ప్రతిపాదనలున్నాయి. ప్రభుత్వం ఆమోదం కోసం వేచిచూస్తున్నాం. నగరంలో ఖాళీ స్థలాలతో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఇప్పటికే దృష్టి సారించాం. రిజర్వు స్థలాలను శుభ్రం చేసి మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నాం. అవకాశం ఉన్న చోట్ల పార్కులు అభివృద్ధి చేస్తున్నాం. ప్రయివేటు స్థలాల యజమానులను గుర్తించి సచివాలయ సిబ్బంది నోటీసులు జారీ చేస్తోంది.










