Apr 21,2022 09:32

ప్రజాశక్తి-పీలేరు : చిన్ననాటి స్నేహం మరిచిపోలేనిది. అందునా అంతా వృద్ధులయ్యాక మళ్లీ కలిస్తే.. అందులోనూ అదే స్కూల్లో కలిస్తే.. ఆహా.. అది అసాధ్యం.. సాధ్యపడిందంటే ఉన్నత మధురానుభవం.. అదే ఈ నెల 2న పీలేరులోని నాటి బోర్డు ఉన్నత పాఠశాలలో జరగనుంది.

అంతా 65 ఏళ్ల నాటి విద్యార్థులే. నేడు వృద్ధులువారు. ఎవరెవరు ఎలా ఉంటారో తెలియదు. ఎక్కడున్నారో, ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో కూడా పూర్తిగ తెలియదు. అయినా ఈనెల 24 న వారంతా కలవనున్నారు. వారందరూ పీలేరులోని నాటి బోర్డు ఉన్నత పాఠశాల (ప్రస్తుత ప్రభుత్వ ఉన్నత పాఠశాల)లో చదువుకున్నవారే.

1957-58, 1958-59, 1959-60 సంవత్సరాల ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి పూర్వ విద్యార్థుల జట్టు వారిది. 'తీగ లాగితే.. డొంకంతా కదిలింది' అన్న చందంగా... ఒకరినొకరు పలుకరించుకుంటూ ఆ పలకరింపులు ఖండాంతరాలకు వ్యాపించింది. ఈ ఆదివారం ఉదయం 9 గంటలకు పీలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అందరు ఒకటిగా కలవాలని భావించారు. నాటి తమ తీపి గురుతులను, అనుభవాలను, అనుభూతులను ఒకరితో మరొకరు పంచుకుంటూ.. తమ చదువుల తల్లి ఒడి (బడి)లో పులకరించాలని తపనపడుతున్నారు.

తమ కృతజ్ఞతాపూర్వకంగా వారి శక్తి మేరకు తమ చిన్నప్పటి పాఠశాలకు ఓ జిరాక్స్‌ మిషన్‌, ఒక పెద్ద గోద్రేజ్‌ ఆఫీస్‌ టేబుల్‌ బహూకరించనున్నారు. తదుపరి పాఠశాలకు అవసరమైన అత్యవసర భారీ వసతులు సమకూర్చే ప్రతిపాదనలతోవారున్నారు. అందుకు ఈ 24న ఆదివారం ఉదయం 9 గంటలకు జరిగే, 1957-58, 1958-59, 1959-60 బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల అపూర్వ కలయికలో అందరూ పాలుపంచుకోవాలంటూ సాదరంగా ఆహ్వానిస్తున్నారు.