ప్రజాశక్తి- మదనపల్లె అర్బన్: జిల్లా వ్యాప్తంగా గతవారం రోజులుగా ప్రైవేట్ పాఠ శాలల బస్సులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి భారీ పెనాల్టీలు వేస్తున్న నేపథ్యం లో సోమవారం చిన్న ప్రైవేటు పాఠశాలల సమాఖ్య యుపిఎస్‌ఎఫ్ రాష్ట్రఅధ్యక్షులు ప్రవీణ్ కంటి మహంతి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి శేషాద్రి నాయుడు, రాయల సీమ కార్యదర్శి సంధనీ, గౌరవ సలహాదారుడు మనోహర్, శ్రీనివాసుల రెడ్డి చిత్తూరులో ఉపరవాణా కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా వలన తీవ్రఆర్థిక నష్టానికి గురై చిన్నచిన్న ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో రెండో స్కూల్ బస్సులు కలిగి ఉన్నాయని, వాటిలో కూడా కొన్ని నడపలేక పక్కన పెట్టేసి అతి కష్టం మీద స్కూళ్లను నిర్వహిస్తున్న పరిస్థితులలో విపరీతమైన జరిమానాలు వేయడం, దారుణమని డీటీసీ బసిరెడ్డి దష్టికి తీసుకెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించి అక్కడికక్కడే రెండు స్కూళ్లకు వేసిన పెనాల్టీలో సగం తగ్గించి భవిష్యత్తులో పర్మిట్, రోడ్డు టాక్స్ ఫిట్నెస్‌లకు మాత్రమే పెనాల్టీ వేసే విధంగా ఎంవీఐ, ఏఎంవీఐలకు ఆదేశాలిస్తామని హామీ ఇచ్చారన్నారు.










