పూడుకుపోతున్న చినకాపవరం డ్రెయిన్
చెత్తకు నిప్పు పెట్టడంతో పరిసర ప్రాంతాలను కమ్మేస్తున్న పొగ
స్థానికుల అవస్థలు
పట్టించుకోని అధికారులు
ప్రజాశక్తి - ఆకివీడు
ఆకివీడు పట్టణ ప్రజల పాలిట చెత్త సమస్య శాపంగా మారింది. పంచాయతీ స్థాయిలో సమస్య మొదలై నేడు నగర పంచాయతీ స్థాయికి చేరినా పరిష్కారం కాని పరిస్థితి నెలకొంది. ఏళ్ల తరబడి చెత్త సమస్య ఆకివీడును పట్టిపీడిస్తోంది. రోజురోజుకూ సమస్య పెరుగుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకివీడు నుంచి సిద్ధాపురం వెళ్లే రోడ్డులో చినకాపవరం డ్రెయిన్‌పై వంతెన వద్ద పట్టణంలోని చెత్త మొత్తం తీసుకొచ్చి నగర పంచాయతీ వారు వేసేస్తున్నారు. దీంతో సుమారు 45 అడుగుల వెడల్పున్న సిద్ధాపురం రోడ్డు బక్కచిక్కి ప్రస్తుతం పది అడుగులకు చేరింది. తారు రోడ్డు మొత్తం చెత్తకుప్పల మయంగా మారింది. ఈ వంతెనను అనుకుని సుమారు 200 నుంచి 300 కుటుంబాలు నివసిస్తున్నాయి.
చెత్తకు నిప్పు.. జనం, వాహనదారుల అవస్థలు
రోజూ ఇక్కడ చెత్తకు నిప్పు పెడుతుంటారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగతో నిండిపోతోంది. ఈ నేపథ్యంలో ఆ రోడ్డు గుండా ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనపడని పరిస్థితి నెలకొంది. ఒక దశలో ఇళ్లల్లో వారు కూడా ఒకరికి ఒకరు కనిపించని స్థాయిలో పొగ కమ్మేస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఇటీవల పొగ ప్రభావానికి అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ రోడ్డు గుండా సిద్ధాపురం, చినమిల్లిపాడు, కోళ్లపర్రు, రాజులపేట, కళింగగూడెం, నందమిల్లిపాడు, కొల్లేరు గ్రామాల ప్రజలు, రైతులు, చేపల చెరువుల యజమానులు, కార్మికులు ప్రతినిత్యం వందలాదిగా రాకపోకలు సాగిస్తుంటారు. అయితే పొగకు పలు సార్లు ప్రమాదాలకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి.
చెత్తంతా ఇక్కడే వేసేయడంతో చినకాపవరం డ్రెయిన్ పూడుకుపోతోంది. కోస్తా జిల్లాల్లోనే అతిపెద్ద మీడియం డ్రెయిన్ ఇది. ఈ డ్రెయిన్ ద్వారా సుమారు పది మండలాల్లోని మురుగు నీటిని ఉప్పుటేరు గుండా కొల్లేటిలోకి చేరుస్తుంది. ఈ కాలువకు అడ్డంకులు ఏర్పడితే పది మండలాల్లోని పంట నాశనం అవుతోంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ డ్రెయిన్ ఆకివీడు చెత్తతో పూడుకుపోతోంది. అయినా అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చెత్త డంపింగ్‌కు కోసం ప్రత్యేక స్థలం చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అయినా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెత్త సమస్యను పరిష్కరించాలని కోరారు.










