Aug 09,2022 22:37

చెత్త భారం

జులై బడ్జెట్‌లో పెరిగిన పద్దు
వసూళ్లలో సచివాలయ సిబ్బంది
ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్‌

చెత్తపన్ను పేరుతో మున్సిపాలిటి ప్రజల పై భారాలు మోపుతోంది. జూలై నెల పద్దులో చెత్తపన్ను రూ. 70 అదనంగా వచ్చి చేరింది. అసలే పెరిగిన నిత్యవసరాలు, పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ విద్యుత్‌ చార్జీల మోతతో అల్లాడుతున్న జనంపై చెత్తపన్ను వచ్చి చేరింది. చెత్త భారం ప్రజలపై వేయోద్దుంటూ ప్రతిపక్ష పార్టీలు ప్రజా ఉద్యమం ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించినా ... ప్రజా సంక్షేమ ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న జగన్‌ సర్కర్‌ చెత్తపన్ను పేరుతో ప్రజలపై బలవంతంగా వసూలు చేసేందుకు సిద్దం అయింది. కరోనా కష్టాల నుండీ గట్టెక్కి ఇపుడిపుడే కొలుకుంటున్న తమపై చెత్తపన్ను పేరుతో భారాలు వేయడం ఏమిటని సామాన్య ప్రజలతో పాటు దుకాణదార్లు, సినిమా థియేటర్‌, షాపింగ్‌మాల్స్‌, కళ్యాణ మండపాల యజమానులు వాపోతున్నారు.
చెత్తపన్ను వసూలుపై ఏడాది క్రితమే ప్రభుత్వం నుండీ స్పష్టమైన ఆదేశాలు అందింనప్పటికీ ప్రజలు, కార్పోరేటర్ల నుండీ వ్యతిరేకత రావడంతో చిత్తూరు నగర పాలక సంస్థ వెనకడుగు వేసింది. సామాన్య కుటుంబాలపై వేసే చెత్తపన్ను భారం తగ్గించాలని చిత్తూరు నగర పాలక సంస్థ కౌన్సిల్‌ తీర్మానం చేసి పంపింది. స్పల్పంగా తగ్గించి మురికివాడల్లోని గృహాల నుండీ రూ. 50, మధ్య తరగతి నివాసం ఉంటున్న ప్రాంతాల్లో రూ. 70, చిల్లర దుకాణాలు ( చిన్నవి, పెద్దవి) రూ. 500, కళ్యాణ మండపాలు రూ. 2వేలు, షాపింగ్‌ మాల్స్‌, పెద్ద హౌటల్స్‌ రూ. 3,000-3,500 చొప్పున వసూలు చేయాలని ప్రభుత్వం నుండీ ఆదేశాలు రావడంతో నగర పాలక సంస్థ పరిధిలోని వార్డు వాలంటీర్ల ద్వారా జూలై మాసం చెత్తపన్ను ఆగస్ట్‌ ఒకటో తారీకు నుండీ వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రతి గడపా తిరుగుతూ చెత్త పన్నును వాలంటీర్లు వసూలు చేస్తున్నారు. ప్రజల నుండీ ప్రతిఘటన వస్తున్నా ప్రభుత్వ ఆదేశాలు అమలు చేస్తున్నాం మేము చేయగలిగిందేమిలేదంటూ వాలంటీర్లు చెబుతున్నారు.
కట్టకపోతే సంక్షేమ పథకాల్లో కోత
చెత్తపన్ను ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు కట్టితీరాల్సిందే... లేదు... కూడదు నేను కట్టను అంటే రేషన్‌కార్డు, అమ్మఒడి, ఇంటిస్థలం రద్దు అవుతాయని కొందరు వాలంటీర్లు ప్రజలను బెదిరించి మరీ కట్టించుకుంటున్నటు సమాచారం. ఏ మాత్రం సమయం ఇవ్వకుండా వెంటనే కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నట్లు మురివాడల్లోని ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా మురికివాడల్లో చెత్తపన్ను ఎందుకు కట్టాలి రోడ్లులేవు, తాగునీరు రాదు. వీది లైట్లు వెలగవంటూ జనం నిలదీస్తున్నారు. ఇంటి పన్నులు కడుతున్నాం అదనంగా నెలకు రూ. 50, 70 చెల్లించాలంటే ఎలా అని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆలోచించి చెత్తపన్ను వసూలు రద్దు చేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు : డాక్టర్‌ అరుణ, కమిషనర్‌
ప్రభుత్వ ఆదేశాల మేరకు చెత్తపన్ను వసూలు చేయడం జరుగుతోంది. స్వచ్ఛ చిత్తూరు పేరుతో ఇంటింటా చెత్తసేకరణ కోసం ఆటో రిక్షాలు అందుబాటులోకి తీసుకొచ్చాం. చిత్తూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అభివృద్ధి కోసం ప్రజలు సహకరించాలి. జూలై నెల నుండీ ప్రతి నెలా చెత్తపన్ను కచ్ఛితంగా చెల్లించాల్సిందే.