ప్రజాశక్తి - యాదమరి
చిత్తూరు జిల్లాలో వర్షపు నీటిని ఒడిసి పట్టుకునేందుకు అమత్ సరోవర్ పథకం ద్వారా రైతులే తమకు కావాల్సిన పథకాలను ఎంపిక చేసుకోవడం జరిగిందని, తద్వారా మంచి ఫలితాలను పొందనున్నారని కలెక్టర్ ఎం. హరి నారాయణన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కేంద్ర బందం నోడల్ అధికారి ఉమా నండూరి తో కలిసి యాదమర్రి మండలంలోని బుడితి రెడ్డిపల్లి లో నిర్మించిన అమత్ సరోవర్ పథకాన్ని పరిశీలించారు. కేంద్ర జాయింట్ సెక్రటరీ ఆఫ్ కల్చర్ కు సంబంధించిన ఉమా నండూరి పలు కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అమత్ సరోవర్ పథకం ద్వారా నిర్మించిన చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రైతులతో మాట్లాడుతూ ఈ పథకం వల్ల లాభం గురించి అడిగారు. అందుకు రైతు సమాధానం ఇస్తూ గతంలో వర్షాలు లేక చాలా ఇబ్బందులు పడేవారమని గత మూడు సంవత్సరాలుగా భారీగా వర్షాలు కురుస్తుండడంతో ఎన్నడూ లేని విధంగా నీరు పొలాల మీదకు వచ్చి ఉద్యాన పంటలు కూడా నష్టపోయే ప్రమాదం వాటిల్లిందని, అయితే ఈ చెరువును నిర్మించడం ద్వారా నీటిని ఒకచోటికి ఒడిసిపట్టి తద్వారా చెరువులకు పంపడం జరుగుతుందని అన్నారు. దీనివల్ల పంట పొలాలలోకి నీరు వచ్చే అవకాశం ఉండదని చెరువులో నీరు నిల్వ ఉండడం వల్ల బోర్లలో నీటిమట్టం పెరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గతంలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదు అయ్యేదని అందువల్ల పంటలు కోల్పోయేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేక నీరు నిల్వ ఉంచుకోవడం ద్వారా బోర్లలో ఉంచుకోవడం ద్వారా బోర్లలో నీటిమట్టం బాగా పెరిగి అందరికీ ఉపయోగకరంగా ఉందని అన్నారు. గతంలో జిల్లా వ్యాప్తంగా వెయ్యి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే వారని, ప్రస్తుతం కేవలం ఆరు ట్యాంకర్లు ద్వారా మాత్రమే చేయడం జరుగుతుందని ఆమెకు వివరించారు. పలు ప్రజా ప్రయోజనాల కోసం పనులు చేపట్టడం పట్ల సంతప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆమె కాణిపాకం లోని అవెన్యూ ప్లాంటేషన్, ఐరాల మండలం పాతపాళ్యం లో ఫ్లోరికల్చర్, తవనంపల్లి, మండలంలోని వేదగిరి వానపల్లి లో రూఫ్ వాటర్ స్ట్రక్చర్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ శేఖర్‌తో పాటు మరో ఇద్దరు కేంద్ర బంద సభ్యులు పాల్గొన్నారు.










