Aug 21,2023 22:58

చెరకు రైతుల బకాయిలు వెంటనే చెల్లించాలి
ప్రజాశక్తి - పిచ్చా టూరు

చిత్తూరు జిల్లా నిండ్ర వద్ద ఉన్న నేతమ్స్‌ షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దాసరి జనార్ధన్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం చెరుకు రైతుల సంఘం ఆధ్వర్యంలో నిండ్ర క్రాస్‌ రోడ్‌ వద్ద రాస్తారోకో జరిగింది .ఈ సందర్భంగా దాసరి జనార్ధన్‌ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా యాజమాన్యం రైతులను మోసం చేసి చెరుకు తోలిన రైతు లకు బకాయిలు చెల్లించకనే కాలయాపన చేస్తున్నా అటు జిల్లా అధికారులు గానీ, ఇటు ప్రజాప్రతినిధులు గాని రైతులకు రావాల్సిన 35 కోట్ల రూపాయల సొమ్మును చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. నేతాజీ చెరుకు రైతుల సంఘం నాయకులు ఆదినారాయణ రెడ్డి, శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ చెరుకు రైతుల బకాయిలపై అసిస్టెంట్‌ కెన్‌ కమిషనర్‌ నిర్లక్ష్యం కారణంగానే రైతులు మోసపోయారని, రైతులను మోసం చేసిన యాజమాన్యంపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి రైతులకు రావాల్సిన బకాయిలను చెల్లించే వరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. నిండ్ర ఎస్సై, సీఐలు ఆందోళన కారులను శాంతింపజేసి నిండ్ర తహశీల్దార్‌తో, కలెక్టర్‌తో ఫోన్లో సంప్రదించి పది రోజుల్లోపు గట్టి చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు విరమించారు. ఒకానొక సందర్భంలో రైతులకు పోలీసులకు వాగ్వాదం జరిగి రోడ్డు మీదకి వెళ్లి నిరసన తెలియజేసి ఆందోళనలు దిగారు. దీంతో రోడ్డుపై రాస్తారోకో చేయడం వల్ల దాదాపు రెండు కిలోమీటర్ల మేర రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. రైతు నాయకులు గుణశేఖర్‌ రెడ్డి, రఘునాథరెడ్డి, సుదర్శన్‌ నాయుడు ప్రకాష్‌ నాయుడు రైతు సంఘం నాయకులు రామచంద్రారెడ్డి, ముని శంకర్‌, పాపయ్య పాల్గొన్నారు.