అనంతపురం కలెక్టరేట్: చేనేత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకునే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టి చేనేతరంగానికి చేయూతనిస్తున్నట్లు కలెక్టర్ ఎం.గౌతమి తెలిపారు. శుక్రవారం నాడు జిల్లా స్థాయి వైఎస్సార్ నేతన్న నేస్తం కార్యక్రమాన్ని అనంతపురం కష్ణ కళామందిరం రెవెన్యూ కళ్యాణమండపంలో నిర్వహించారు. చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమానికి నేతన్న నేస్తం ఉపయోగపడుతుందని చెప్పారు. జిల్లాలో 2023- 24 సంవత్సరానికి ఐదో విడతగా నేతన్న నేస్తంకు సంబంధించి 9150 మంది అర్హులైన చేనేత కార్మికులకు రూ.21.96 కోట్లను ప్రభుత్వం వారి ఖాతాల్లోకి జమ చేసిందన్నారు. చేనేత అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటును అందిస్తోందని చెప్పారు. ప్రతి శనివారం జిల్లా అధికారులు, ఉద్యోగులు చేనేత దుస్తులు ధరించే విధంగా ప్రత్యేక సర్కులర్‌ను జారీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం లబ్ధిదారులకు నేతన్న నేస్తం మెగా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాటక అకాడమీ ఛైర్మన్ హరిత, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ నదీమ్ అహ్మద్, ఎడిసిసి బ్యాంక్ ఛైర్మన్ లిఖిత, ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ మంజుల, సిడబ్ల్యుసి ఛైర్మన్ మేడా రామలక్ష్మి, ఉరవకొండ ఎంపిపి చందా చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.










