ప్రజాశక్తి-ధర్మవరం టౌన్, బత్తలపల్లి టిడిపి అధికారంలోకి రాగానే చేనేత కార్మికులను ఆదుకుంటామని, మగ్గం ఉన్న ప్రతి కార్మికునికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. నారా లోకేష్ 58వ రోజు యువగళం పాదయాత్ర ఆదివారం ధర్మవరం పట్టణం నుంచి ప్రారంభమైంది. స్థానిక మార్కెట్ యార్డ్ సమీపంలోని సిబిఎన్ కల్యాణమండపంలో చేనేతల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. గొట్లూరులో కురుబ సామాజిక వర్గీయులతో ఆయన భేటీ అయ్యారు. నాగలూరులో బోయ కులస్తులతో సమావేశమయ్యారు. వేల్పుమడుగు వద్ద పొడరాళ్లపల్లి వాసులతో మాట్లాడారు. బత్తలపల్లిలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. ధర్మవరం చేనేతకు పుట్టినిల్లు అన్నారు. దేశంలోనే ధర్మవరం పట్టుచీరలకు మంచి పేరు ఉందన్నారు. అయితే వైసిపి పాలనలో చేనేత కార్మికులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఒక్క ధర్మవరం పట్టణంలోనే 53 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలను వైసిపి ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక చేనేత కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. చేనేత వస్త్రాలపై జిఎస్‌టి వేయాలని టిడిపి ప్రభుత్వ హయాంలోనే కేంద్రం ప్రతిపాదన పెట్టిందన్నారు. అయితే అప్పుడు కేంద్రంతో మాట్లాడి పక్కన పెట్టించామని తెలిపారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక చేనేత వస్త్రాలపై జిఎస్‌టి వసూలు చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చేనేత వస్త్రాలపై జిఎస్‌టిని ఎత్తివేయించడానికి కృషి చేస్తామని చెప్పారు. టిడిపి అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారని జగన్ వాలంటీర్లతో ప్రచారం చేయిస్తున్నాడన్నారు. రాష్ట్రానికి సంక్షేమాన్ని పరిచయం చేసిందే టిడిపి అన్నారు. జగన్ పాలనలో ఖైదీలకు కల్పించే సౌకర్యాలు కూడా విద్యార్థులకు కల్పించడంలేదన్నారు. ఖైదీలకు నెలకు రూ.2 వేలు ఖర్చు చేస్తుంటే విద్యార్థులకు కేవలం రూ.వెయ్య మాత్రమే మెస్ ఛార్జీలు ఇస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదన్నారు. గ్రూప్ 2, డిఎస్‌సి లేదన్నారు. వైసిపి ప్రభుత్వం రైతులను ఆదుకోకపోగా వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టి ఉరితాళ్లు బిగిస్తోందన్నారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అరాచకాల గురించి తెలుసుకున్నాక ఆయన కేతిరెడ్డి కాదు.. నంబర్ వన్ కేటుగాడు అని అర్థమైందని విమర్శించారు. టిడిపి హయాంలో ధర్మవరంలో ధర్మం ఉండేదని అన్నారు. కేటుగాడు ఎమ్మెల్యే అయ్యాక ధర్మవరంలో మొత్తం అధర్మమే అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరిటాల సునీత, టిడిపి సత్యసాయి జిల్లా అధ్యక్షులు బికె.పార్థసారధి, పరిటాల శ్రీరాం, కందికుంట ప్రసాద్, బండారు శ్రావణిశ్రీ తదితరులు పాల్గొన్నారు.
నారా లోకేష్‌కు చేనేత పట్టు వస్త్రాలు అందజేత
నారా లోకేష్‌కు ధర్మవరం తొగట వీర క్షత్రియులు వారి కులదేవత చౌడేశ్వరిదేవి చిత్రంతో ఉన్న పట్టు వస్త్రాన్ని లోకేష్‌కు అందజేశారు. 40 ఏళ్లుగా చేనేతలకు అండదండగా నిలుస్తున్న టిడిపి కుటుంబానికి పట్టుచీరలు, పంచెలు, కండువాలు అందజేశారు. తొగటవీర క్షత్రియులకు లోకేష్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించండి
ప్రభుత్వం నుంచి పరిహారాన్ని ఇప్పించి న్యాయం చేయాలని ముదిగుబ్బ మండలం పొడరాళ్లపల్లి జిల్లేడు బండ ప్రాజెక్టు ముంపు రైతులు లోకేష్‌ను కలిసి విన్నవించారు. 2003లో చంద్రబాబు నాయుడు సిఎంగా ఉన్న సమయంలో ఎక్కువగా భూములు ముంపునకు గురికాకుండా 0.48 సామర్థ్యంతో ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చారన్నారు. దీంతో మిగిలిన సాగుభూమిలో మామిడి, చీని, జామ, పూల మొక్కలు పెంచుకుని జీవనం సాగిస్తున్నామన్నారు. అయితే వైసిసి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును 2.48 టిఎంసిలకు పెంచుతూ అనుమతులు మంజూరు చేసిందన్నారు. దీనివల్ల దాదాపు 1500 ఎకరాలు ముంపునకు గురవుతుందన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణపై రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు రూ.30 లక్షలు పరిహారం చెల్లించేలా చూడాలని రైతులు నారా లోకేష్‌ను కోరారు. స్పందించిన లోకేష్ రాష్ట్రంలో సిఎం జగన్ ప్రభుత్వానికి భూములు లాక్కోవడంపై ఉన్న శ్రద్ధ నిర్వాసితులకు పరిహారం అందించడంలో చూపలేదన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీనిపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చండి
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వాల్మీకి బోయలను ఇతర రాష్ట్రాల మాదిరిగా ఎస్టీ జాబితాలోకి చేర్చేలా కృషిచేయాలని వాల్మీకి బోయ సంక్షేమ సంఘం ప్రతినిధులు లోకేష్‌ను కలిసి విన్నవించారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి పైగా వాల్మీకులు, బోయలు ఉన్నారని కులవృత్తి లేక కూలిపనులు, చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. వాల్మీకి ఫెడరేషన్ ద్వారా సామాజిక వర్గీయులకు బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దామాషా పద్ధతిన వాల్మీకి బోయ కార్పొరేషన్‌కు నిధులు కేటాయిస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.










