చేదెక్కిన బెల్లం
కష్టాల్లో చెరకు రైతులు
నష్టాల్లో బెల్లం తయారీ రైతులు
ప్రజాశక్తి- వెదురుకుప్పం
జిల్లాలో చెరకు సాగు చేసే రైతులకు ఈ పంట తీపి పంటగా ఉండేది, ఎక్కువ శాతం రైతన్నలు ఈ పంటను సాగుచేయడానికి ఆసక్తిచూపేవారు. వ్యవసాయ పొలాల వద్ద ప్రతి రైతు నల్లబెల్లం తయారు చేసి అమ్ముకోవడం ద్వారా కాస్తోకూస్తో ఆదాయం ఆర్జించేవారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆంక్షలతో నల్లబెల్లం కొనుగోలు, విక్రయాలపై ఆంక్షల వలన సరైన ధరలేక రోజురోజుకు చెరకు పంట సాగు విస్తీర్ణం తగ్గుతోంది. రైతుల నుంచి వ్యాపారులు నల్లబెల్లం కొనేందుకు ముందుకు రావడం లేదు. దీంతో చెరకు సాగుపై రైతులు ఆసక్తి చూపకపోగా గతంలో గానుగాడించి తయారు చేసిన నల్లబెల్లంను ఏం చేయాలో తెలీని పరిస్థితిలో ఉన్నారు. చెరకు రైతులు తమ ఆవేదనను ప్రజాశక్తితో పంచుకున్నారు.
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఆరు మండలాలున్నాయి. ఇందులో కార్వేటినగరం మండలంలో 1258 హెక్టార్లు, వెదురుకుప్పంలో 518 హెక్టార్లు, ఎస్‌ఆర్‌పురంలో 915 హెక్టార్లు, పెనుమూరులో 2050 హెక్టార్లు, గంగాధర నెల్లూరులో 781 హెక్టార్లు, పాలసముద్రంలో 66 హెక్టార్లు విస్తీర్ణంలో చెరకును సాగు చేస్తున్నారు రైతులు. ఈ మండలాల్లో చాలా వరకు చెరకును గానుగుల సహాయంతో నల్లబెల్లంను తయారు చేస్తారు. కొంతమంది రైతులు గానుగాడించి బెల్లం తయారు చేసి అమ్ముకోలేక ఎస్‌ఆర్‌పురం మండలం నెలవాయి దగ్గర ఉన్న చక్కెర ఫ్యాక్టరీకి తరలిస్తుంటారు. నియోజకవర్గంలో చాలా వరకు రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ఇందులో ప్రధానంగా వాణిజ్య పంట్లో ఒకటైన చెరకును సాగు చేస్తుంటారు. ఈ పంటలో వచ్చే ఆదాయంతో అప్పులన్నీ తీర్చుకునేవారు. ఈఏడాది నల్లబెల్లం అమ్ముకోవడంలో తీవ్రంగా ఇబ్బందులు వస్తున్నాయి, నిల్వ ఉంచుదామంటే వర్షాకాలంలో బెల్లం కరిగిపోయే ప్రమాదం ఉంది. దీంతో రైతులు ఏం చేయాలో తెలియక సందిగ్ధంలో పడ్డారు.
సాధారణంగా ఒక ఎకరా చెరకు పంట సాగు మొదలుపెట్టినప్పటి నుంచి బెల్లం తయారు చేసేవరకు, కూలీలతో సహా ఒక రైతుకు సుమారు రూ.75వేల నుంచి లక్ష వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంది. తీరా పంట పండించి బెల్లం తయారు చేసిన తరువాత వాటికి గిట్టుబాటు లేక, ఆ బెల్లంను ఎలా అమ్ముకోవాలో తెలీక నానా తంటాలు పడుతున్నారు. దీనికితోడు నాటుసారా తయారీదారులు నల్లబెల్లం ఎక్కువగా వినియోగిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నల్లబెల్లం క్రయవిక్రయాలపై ఆంఓలు విధించింది. దీంతో రైతులు తయారుచేసిన బెల్లం అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు లేక ఓ వైపు.. ఎలా నిల్వలు ఉంచుకోవాలో తెలీక మరో వైపు సతమతమవుతున్నారు. కొనమని వ్యాపారుల చూట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
బెల్లం కొనడానికి వ్యాపారస్తులు రావడం లేదు
- దాట్ల చెంగారెడ్డి, బలిజమొండి వెంగనపల్లె, వెదురుకుప్ప మండలం
ఏడాది మొత్తం శ్రమించి చెరకు సాగు చేసి గానుగ ఆడించి నల్లబెల్లం తయారు చేస్తాం. దాన్ని అమ్ముకోవాలంటే నానా ఇబ్బందులు పడుతున్నాము. ప్రభుత్వ ఆంక్షల వలన వ్యాపారులు కొనడానికి ముందుకు రావడంలేదు. నిల్వ చేసుకునే పరిస్థితి లేదు. దీంతో పంటఫలం ఎలా అమ్మాలో.. ఎలా నిల్వ చేసుకోవాలో తెలీయడం లేదు. అప్పులు చేసిన పండించి పంటకు మంచి గిట్టుబాటు ధర వస్తే అప్పుటు తీరుతాయిని ఆశించాం. అయితే ప్రస్తుతం అది జరగడం లేదు. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేసి ఆదుకోవాలి.
పర్మిట్ రాలేదు.. కొట్టలేదు..
- సంపూర్ణమ్మ, కొత్తపల్లిమిట్ట, రైతు, ఎస్‌ఆర్‌పురం మండలం
మాకున్న ఎకరా పొలంలో చెరకు తోటను వేశాం. నెలవాయి దగ్గర ఉన్న షుగర్ ఫ్యాక్టరీ వాళ్లు చెరకు తోలడానికి పర్మిట్ ఇవ్వలేదు.. దీంతో చెరకు కొట్టకుండా పొలంలోనే వదిలేశాం. పోనీ గానుగ ఆడాలంటే ప్రభుత్వ ఆంక్షలు పెట్టింది. కష్టపడి చెరక కొట్టి బెల్లం తయారు చేసినా కొనేవాళ్లు లేరు. దీంతో కష్టపడి పండించిన పంట పొలంలోనే వదిలేశాం.










