May 04,2023 10:59

ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందిస్తున్న మంత్రి ఉషశ్రీచరణ్‌

           కళ్యాణదుర్గం : విద్యతోనే జీవితంలో అభివృద్ధి సాధించగలమని, ప్రతి విద్యార్థీ కష్టపడి చదవి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్‌ తెలిపారు. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహించిన ఉద్యోగ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల తలరాతలు మారాలంటే విద్య ఒక్కటే సరైన మార్గం అన్నారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థీ ఉన్నత విద్యను అభ్యసించాలని ఆకాంక్షిస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి విద్యాభివృద్ధికి పలు చర్యలు చేపట్టారన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం ఈ సంవత్సరం ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రత్యేకంగా నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూలో బోరంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల నుంచి 37 మంది విద్యార్థులు పలు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. వీరికి నియామక పత్రాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు.