May 07,2023 21:14

రేషన్‌ తీసుకుంటున్న మహిళ

         ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం   మండలంలోని చౌకధాన్యం దుకాణాల్లో రేషన్‌ డీలర్లు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అధిక ధరకు పంచదార, కందిపప్పు విక్రయిస్తున్నారు. దీనికి తోడు దుకాణాల్లో ఎక్కడా ధరల పట్టికగానీ, స్టాకు వివరాలుగానీ కనిపించడం లేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి రేషన్‌ అందజేయాలనే ఉద్దేశంతో ఎంతో ఆర్భాటంగా వాహనాలను సైతం ఏర్పాటు చేసింది. ఇందుకు రూ.కోట్లు ఖర్చు చేసింది. అయితే అందుకు తగ్గ ఫలితాలు మాత్రం శూన్యమనే విమర్శలు వినిపిస్తున్నాయి. చాలాగ్రామాల్లో ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేసే వాహనాలు మూలనబడ్డాయి. చేసేదిలేక రేషన్‌ దుకాణాల వద్దే రేషన్‌ పంపిణీ చేస్తున్నారు. మండలవ్యాప్తంగా రేషన్‌ దుకాణాల్లో డీలర్లు ఎక్కడా నిబంధనలు పాటించకపోవడంతో కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలో 21,337 రేషన్‌ కార్డులుగాను 64,663 మందికి 51 చౌకధాన్య దుకాణాలను ఏర్పాటు చేశారు. వీరందరికీ ప్రతినెలా బియ్యంతోపాటు కందిపప్పు, పంచదార పంపణీ చేయాలి. అయితే కందిబేడలు, పంచదారకి మూడు రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నట్లు కార్డుదారులు వాపోతున్నారు. ప్రభుత్వం వెబ్‌సైట్‌ ఆధారంగా గతనెల ఏప్రిల్‌లో కందిపప్పు 16,281 కిలోలు, పంచదార 7,931 కిలోలను ఆయా డీలర్లకు కేటాయించారు. నిబంధనల మేరకు కందిపప్పు పాకెట్‌కు రూ.67, పంచదార (అరకిలో) పాకెట్‌కు రూ.17 వసూలు చేయాలి. కానీ కందిపప్పు రూ.70, పంచదారకు రూ.20 వసూలు చేస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. రూ.3 చొప్పున కందిపప్పునకు రూ.48,843, పంచదారకు రూ.23,793ను అదనంగా వసూలు చేస్తున్నారు. ఈలెక్కన నెలకు రూ.72,636, ఏడాదికి సగటున రూ.8,71,632 వసూలు చేస్తున్నారు. పౌరసరఫరా శాఖ నిబంధనల మేరకు ప్రతి చౌకధాన్యం దుకాణం వద్ద స్టాకు వివరాలు, సరుకుల ధరలు, పంపిణీ చేసిన వివరాల ప్రదర్శన బోర్డులను ఏర్పాటు చేయాలి. దీనికితోడు కంప్యూటర్‌ స్కేల్‌తో తూకాలు వేయాలి. ప్రతి రేషన్‌ కార్డుదారుడికీ రేషన్‌ తీసుకున్న తర్వాత తప్పనిసరిగా రసీదు ఇవ్వాలి. అయితే మండలంలో మాత్రం ఈ నిబంధనలను ఎక్కడా పాటించడం లేదు. ఇవన్నీ ఉన్నతాధికారులకు తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా పౌరసరఫరా శాఖ ఉన్నతాధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న డీలర్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.