ప్రజాశక్తి - కాళ్ల
రాష్ట్ర భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ టిడిపి చైతన్య రథయాత్ర మంగళవారం కాళ్ల చేరుకుంది. ఈ సందర్భంగా చైతన్య రథం డ్రైవర్ రవి, సహాయకుడు శ్రీనును టిడిపి జిల్లా అధికార ప్రతినిధి వీరవల్లి శ్రీనివాస్ సత్కరించి నూతన వస్త్రాలు, నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా వీరవల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం మినీ మహానాడులో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టిన చైతన్య రథయాత్ర ఇప్పటివరకూ 25 నియోజకవర్గాల్లో విజయవంతంగా పూర్తయ్యిందన్నారు. వైసిపి అరాచక పాలనతో విసిగి వేశారిన ప్రజలు టిడిపి చైతన్య రథయాత్రకు నీరాజనాలు పట్టారన్నారు. జోన్-2 పరిధిలోని టిడిపి ముఖ్య నేతలంతా ఈ బస్సుయాత్రలో పాల్గొని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో టిడిపి విజయం ఖాయమని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జోన్-2 టిడిపి మీడియా కోఆర్డినేటర్ బోళ్ల సతీష్‌బాబు, చెరుకువాడ గ్రామ అధ్యక్షులు ఇర్రింకి బుజ్జి, ద్రోణాద్రి కనక నర్సింహస్వామి, బొక్కా సత్యనారాయణ పాల్గొన్నారు.










