Apr 16,2023 21:32

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి

ప్రజాశక్తి-అనంతపురం       'సాహిత్యమైన మనిషిని చైతన్యపరచి ముందుకు నడిపించాలని, నిన్నటి కంటే నేడు.. నేటి కంటే రేపు సమాజం, మనిషి ఉన్నతంగా అభివృద్ధి చెందేటట్లు సాహిత్యం ప్రధాన భూమిక పోషించాలని, మన ఆలోచనలను అర్థం చేసుకోవడానికి జీవితాన్ని చైతన్య పరచుకోవడానికి సాహిత్యం ఎంతో అవసరం ' అని వక్తలు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం అనంతపురం జిల్లా శాఖ నిర్వహణలో నందవరం కేశవరెడ్డి రచించిన కాంతి పూలు ఆవిష్కరణ సభ స్థానిక ఎన్జీవో హోంలో ఆదివారం నిర్వహించారు. ఈ సభకు అరసం అనంతరం జిల్లా శాఖ అధ్యక్షులు బి.ఈశ్వర్‌ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేశవరెడ్డి నిరంతరం సాహితీ కౄషి చేస్తున్నారని కొనియాడారు ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి ప్రసంగిస్తూ.. కాంతిపూలు పుస్తకం చదివితే మనిషి నైతికంగా ఎలా జీవించాలో తెలుస్తుందని అన్నారు. ఈ పుస్తకం నిండా మనిషి సంపూర్ణంగా జీవించడం ఎలాగో తెలియజేసే విషయాలు ఉన్నాయన్నారు. విశిష్ట అతిథులు డాక్టర్‌ శాంతి నారాయణ, బండి నారాయణస్వామి ప్రసంగిస్తూ.. జీవితం మనిషిని ఉన్నత మానవుడిగా తీర్చిదిద్దడమే కాక మొత్తం మానవజాతి చైతన్యాన్ని ఉన్నతీకరించగల శక్తి సామర్ధ్యాలు కలిగి ఉంటుందన్నారు. అదే జీవితం ఇలాంటి జీవిత రహస్యాలను ఈ కావ్యం తెలియజేస్తుందని కొనియాడారు. కాంతిపూలు పుస్తకాన్ని సమీక్ష చేసిన తూముచెర్ల రాజారాం ప్రసంగిస్తూ ఈ కావ్యంలో 29 వ్యాసాలు ఉన్నాయన్నారు. ప్రతి వ్యాసం దేనికదే ప్రత్యేకతతో పాఠకుల్ని చదివించే లక్షణం కలిగివుందన్నారు. తరిమెల అమరనాథ్‌రెడ్డి, డాక్టర్‌ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి తదితరులు మాట్లాడుతూ.. అరసం అన్నవరం జిల్లా శాఖ కార్యవర్గ సభ్యులు కాంతి పూలు రచయిత నందవరం కేశవరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ రాధేయ, అరసం అనంతరం జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ నానీల నాగేంద్ర, ఆకుపచ్చ వెంకటేశులు, ఏలూరు యంగన్న, చంద్రశేఖర శాస్త్రి, నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ డివిజనల్‌ మేనేజర్‌ ఎ. ఓబుళపతి, డాక్టర్‌ తన్నీరు నాగేంద్ర, పూజారి ఈరన్న, కొత్తపల్లి సురేష్‌, మధుర శ్రీ, డాక్టర్‌ జన్నే ఆనంద్‌ కుమార్‌, చెట్ల ఈరన్న, నరసిరెడ్డి, వన్నప్ప, డాక్టర్‌ జూటూరు షరీఫ్‌, రియాజుద్దీన్‌, డాక్టర్‌ అప్పిరెడ్డి హరినాథ్‌రెడ్డి, ఆదిఆంధ్ర తిప్పేస్వామి, ఆర్‌ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.