Jul 26,2023 16:57
  • ఎదురుచూడలేక ప్రయివేట్ నెట్ వర్క్ ల వైపు వినియోగదారుడి చూపు

ప్రజాశక్తి-ఆత్మకూరు(అనంతపురం) : ఆత్మకూరు మండలంలో బిఎస్ ఎన్ ఎల్ నెట్ వర్క్ సేవలు దారుణంగా తయారయ్యాయి. ఎంతకాలానికీ సేవలు మెరుగు పడక పోవడంతో వినియోగదారులు ప్రయివేటు నెట్ వర్క్ లను గత్యంతరంలేని స్థితిలో ఆశ్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. నెట్ వర్క్ టవర్ సమీపంలో ఉన్నా ఫోన్ లో సిగ్నల్ కనిపించదు. జీయో సేవలు అందుబాటులో లేనంతవరకు వినియోగదారులకు అంతో ఇంతో సేవలందించిన ప్రభుత్వ నెట్ వర్క్ సంస్థ ఆతర్వాత సేవలందించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. స్మార్ట్ ఫోన్లు వచ్చాక లేదా అంతకు మునుపే డ్యుయెల్ సిమ్ సిస్టం అందుబాటులోకి వచ్చాక వినియోగదారుడు తప్పనిసరిగా బిఎస్ ఎన్ ఎల్ సిమ్ తో బాటు నాణ్యమైన సేవలందిస్తోందని బావించిన ఏదోఒక ప్రయివేట్ నెట్ వర్క్ ను ఉపయోగిస్తూవచ్చారు. జియో నెట్ వర్క్ అందుబాటులోకి వచ్చాక కొన్ని ప్రయివేట్ నెట్ వర్క్ లు సేవలందించడంలో వెనుకబడిపోయాయని ,తదనంతర కాలంలో బిఎస్ ఎన్ ఎల్ సేవలు నామమాత్రావశిస్టం కావడంతో వినియోగ దారులు ఎక్కువగా ప్రయివేట్ నెట్ వర్క్ లపైనే ఆధారపడాల్సివస్తోందని పేర్కొంటున్నారు. అంతేగాక తనసిమ్ ఏ నెట్ వర్క్ సేవలందుకోవాలన్నా అదే నెంబరు ఉపయోగించే వెసులుబాటు ఉండడంతో   వినియోగదారుడు ప్రయివేటు నెట్ వర్క్ ల చుట్టూ పరిబ్రమిస్తున్నాడు. ఐనా బిఎస్ ఎన్ ఎల్ నెట్ వర్క్ పట్ల కాసింత మమకారం వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. మండలపరిధిలో గ్రామాలలో ఎర్పాటైన సెల్ టవర్లు కేవల అలంకార ప్రాయంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వనెట్ వర్క్ కు పూర్వపు రోజులు తిరిగిరావాలని పలువురు కోరుకుంటున్నారు. ప్రజల కోరిక నెరవేరుతుందా లేదా కాలమే సమాధానం చెప్పాలి.