అనంతపురం కలెక్టరేట్ : అన్యాయాన్ని ఎదురించి బ్రిటీష్ పరిపాలకులను ధైర్య సాహసాలతో ఎదురొడ్డి ప్రాణాలను సైతం లెక్క చేయని భయమెరుగని భారతీయులు భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌లని సిపిఎం నగర 1వ కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్‌ల 92వ వర్ధంతి సభలను గురువారం నాడు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిర్వహించారు. సిపిఎం, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ తదితర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. అనంతపురం సిపిఎం నగర 1వ కమిటీ ఆధ్వర్యంలో రూరల్ పరిధిలోని సిపిఎం కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో 1వ కమిటీ కార్యదర్శి రామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారతదేశ స్వాతంత్రం కోసం చిన్న వయసులోనే ఉరి కంబాలను ముద్దాడిన వీరులు భగత్‌సింగ్, రాజగురు, సుఖ్‌దేవ్‌లన్నారు. ఎన్ని సంవత్సరాలు గడిచిన భారతీయుల మది నుంచి వారి పోరాట స్ఫూర్తి చెరిగిపోదన్నారు. ఇలాంటి పోరాట యోధులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రస్తుత పాలకులు భగత్‌సింగ్ లాంటి పోరాట యోధుల ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం పెట్టుబడిదారుల చేతుల్లో బందీ అయిపోయిందని విమర్శించారు. దేశ సంపద కొంతమంది చేతుల్లో ఉందన్నారు. ఇలాంటి పాలకులకు ప్రజలకు బుద్ధిచెప్పాలన్నారు. ప్రజాతంత్ర వాదులు భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్ ఆశయాలను కొనసాగించాలంటే ప్రభుత్వాలు పేదల జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అనంతరం కాలనీవాసులతో ప్రతిజ్ఞ చేయించారు. 'కార్పొరేట్ మతోన్మాద నిరంకుశ కోరల్లో నలిగిపోతున్న భారతదేశాన్ని విముక్తి చేయడానికి, సకల ప్రజానీకాన్ని సమీకరించి పోరాటాలు నిర్వహించడం ద్వారా మరో నూతన సమాజ నిర్మాణానికి కదిలి పని చేస్తామని, కార్మిక వర్గ నాయకత్వంలో సమ సమాజ నిర్మాణానికి పూనుకుంటామని, దేశం కోసం, ప్రజల కోసం సొంత ప్రయోజనాలను పక్కనపెట్టి నిస్వార్ధంగా, నిజాయితీగా ప్రజల కోసం కషి చేస్తామని' ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వెంకటనారాయణ, నగర నాయకులు ప్రకాష్, మసూద్, గపూర్, బాబా కాలనీవాసులు షరీఫ్, మోహన్, వలీ పాల్గొన్నారు.
సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో
సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌ల వర్ధంతి కార్యక్రమాన్ని టవర్‌క్లాక్ సర్కిల్ వద్ద నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణ, భగత్‌సింగ్ ఆటో డ్రైవర్స్ యూనియన్ నగర కార్యదర్శి శ్రీనివాసులు, అధ్యక్షులు నాగరాజు సోమప్ప, నాగరాజు, విశ్వ, ముత్తుజ పాల్గొన్నారు.










