Oct 20,2023 23:33

* మున్సిపల్‌ చట్టానికి సవరణలు
* రెవెన్యూ మంత్రి ప్రసాదరావు


ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి:
ఇళ్ల నిర్మాణాల అనుమతులను మరింత సులభతరం చేసేలా ప్రభుత్వం మున్సిపల్‌ చట్టానికి పలు సవరణలు చేసిందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. స్థానిక కళ్యాణ మండపంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రోడ్డు తక్కువ వెడల్పు ఉన్నా స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేందుకు పట్టణ ప్రణాళిక నిబంధనల్లో పలు మార్పులు చేశామని చెప్పారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం రోడ్డు వెడల్పు 30 అడుగులు ఉండాలని, అంతకన్నా తక్కువ ఉన్న చోట బిల్డింగ్‌ అనుమతులు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇరుకుగా ఉన్న రోడ్లను అలానే వదిలేసి, వీలున్నంత మేరకు స్థానిక అవసరాల దృష్ట్యా రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రోడ్డు వెడల్పు 30 అడుగులు ఉన్నా, లేకపోయినా పది అడుగులు కన్నా తక్కువ ఉన్న చోట కూడా అక్కడున్న భవన యజమానుల రహదారికి వీలున్నంత మేర స్థలం ఇచ్చి ఇళ్ల నిర్మాణాలను సాగించేందుకు మార్పులు చేశామని తెలిపారు. సంతోషిమాత కోవెల నుంచి చాకలివీధి వరకు ఇరుకుగా ఉన్న రోడ్లను వీలున్నంత మేర అభివృద్ధి చేసి భవన నిర్మాణదారులకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

గతంలో మాదిరిగా తక్కువ స్థలంలో ఇళ్ల నిర్మాణం సాధ్యం కాదన్న ప్రశ్నే తలెత్తదని చెప్పారు. నగరవ్యాప్తంగా ఇరుకుగా ఉన్న వీధులను గుర్తించామని, వాటిలో ఇళ్ల నిర్మాణం ఇక సులువు కానుందన్నారు. కొంతమంది అవగాహన లేక నిబంధనలను అతిక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని, వాటిని అధికారులు గుర్తించి తొలగిస్తున్నారని చెప్పారు. కొత్త భవనాల నిర్మాణాల ద్వారానే స్థానిక సంస్థలకు ఆదాయం వస్తుందని, నిధులు సమకూరాలంటే కొత్త నిర్మాణాలు జరగాలని అభిప్రాయపడ్డారు. కొత్త నిర్మాణాలు సాగాలంటే నిబంధనలు సవరించాల్సి ఉంటుందని చెప్పారు. నగరవ్యాప్తంగా 23 ప్రాంతాల్లో అక్కడున్న రోడ్డు వెడల్పుకు అనుగుణంగా భవన నిర్మాణదారులు స్థలం వదిలే విధంగా ఇప్పటి నిబంధనలు మార్చామని తెలిపారు. దీన్ని ప్రజలు ఉపయోగించుకుని నిబంధనలకు అనుగుణంగా భవన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషన్‌ చల్లా ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.