Nov 08,2023 23:28

తనిఖీలు చేస్తున్న ఎసిబి అధికారులు (ఫైల్‌ )

ప్రజాశక్తి- పలాస : జిల్లాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ ఒకటి. ఇటీవల కాలంలో విపరీతంగా భవన నిర్మాణాలు జోరందుకుంటున్నాయి. ఎటువైపు చూసిన భవనాలు, అంతస్తులు, అపార్ట్‌మెట్లు విపరీతంగా నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో ఎసిబి అధికారులు తనిఖీలు మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా పెద్ద భవంతులపై అధికార పార్టీకి చెందిన నాయకుల కన్ను పడింది. భవన యజమానుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎదురు తిరిగిన వారికి ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అధికారులు మాత్రం ప్రతి మున్సిపాలిటీలోనూ తనిఖీలు చేస్తున్నామని, అందులో భాగంగా మున్సిపాలిటీలో పెద్ద భవనాలపై తనిఖీలు చేస్తున్నట్లు చెబుతుండడం గమనార్హం.
టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో ఏం జరుగుతుంది?
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో ఏం జరుగుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఈ విభాగంలో రెండేళ్లుగా సుమారు ఆరుగురు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు మారినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అందులో భాగంగా టిపిఒగా పని చేసిన రేవతి విశాఖపట్నం కార్పోరేషన్‌కు బదిలీపై వెళ్ళిపోగా ఆ సమయంలో టిపిఎస్‌గా పని చేస్తున్న వెంకటేశ్వరరావు ఇన్‌ఛార్జి టిపిఒగా పనిచేశారు. ఆయన బదిలీపై వెళ్లిపోవడంతో సిహెచ్‌.నారాయణ, కె.బాలరాజు, సత్యనారాయణ, సీతారాం ఇలా అధికారులు కొద్ది రోజులు పనిచేస్తూ ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. చివరకు టిపిఒగా పనిచేసి ఉద్యోగోన్నతిపై సీతారాం వెళ్లిపోగా, ఆయన స్థానంలో ప్రస్తుతం శ్రీకాకుళం మున్సిపాలిటీలో టిపిఎస్‌గా పని చేసి ఉద్యోగోన్నతిపై టిపిఒగా అప్పలరాజు వచ్చారు. అయితే గతంలో టిపిఎస్‌గా సిహెచ్‌.నారాయణ పనిచేస్తున్న సమయంలో సచివాలయ టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది కలుగజేసుకుని వారే అనుమతులు ఇవ్వడంతో జంట పట్టణాల్లో అనేక భవన నిర్మాణాలు వెలిశాయి. ఉన్నతాధికారులు సెలవుపై వెళ్లిన సందర్భాల్లో వారి డిజిటల్‌ సంతకం సచివాలయ టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందికి అందజేయడంతో ఈ చీకటి వ్యవహారాలు జోరుగా ఊపందుకున్నాయి. సిబ్బందికి భారీగా ముడుపులు అందినట్లు తెలుస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీకు టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో టిపిఎస్‌, టిపిఒలుగా పని చేసేందుకు ముందుకు రావడం లేదు. వచ్చినా కుంటుసాకులు చూపి వేరే చోటకు వెళ్లిపోతున్నారు.
16 మంది భవంతులు తనిఖీ?
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో గత శుక్ర, శనివారాల్లో శ్రీకాకుళం ఎసిబి అధికారులు టౌన్‌ ప్లానింగ్‌ విభాగంపై తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా మున్సిపాలిటీకి చెందిన బరాటం సత్యనారాయణ, మల్లా రాఘవేంద్ర, నిత్యానంద పండా, మల్లా నరసింహమూర్తి, సిందిరి గాయత్రి, బెల్లాల పరమేశ్వరి, మల్లా త్రినాథరావు, వడ్డీ విఠల్‌ కుమార్‌, తంగుడు విజయలక్ష్మి, సంపతిరావు విజరుకుమార్‌, తాళాసు సునీత, తాళాసు పాండురంగారావు, కొంచాడ హరికృష్ణ, చౌదరి రంజిత్‌ కుమార్‌, విక్రమ ఆదిత్య పండాల భవనాలు పరిశీలించడమే కాకుండా వాటి రికార్డులను క్షుణ్ణంగా ఎసిబి అధికారులు పరిశీలించినట్లు తెలు స్తోంది. అయితే అధికార పార్టీకి చెందిన నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఎసిబి అధికారులు తనిఖీలు చేపడుతున్నారా? తమ విధి నిర్వహణలో తనిఖీలో భాగంగా తనిఖీలు చేపడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు మాత్రం తమ విధి నిర్వహణలో భాగంగానే తనిఖీలు చేపడుతున్నట్లు చెబుతున్నారు.
భవన యజమానుల నుంచి వసూళ్లు!
పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవన యజమానులను కొంత మంది అధికార పార్టీకి చెందిన నాయకులు బెదిరించి వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. వీరివలలో పడని భవన యజమానులపై ఉన్నతాధికారులు, ఎసిబి అధికారు లకు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని వీరే ఫిర్యాదు చేసి వారికి మూడు చెరువుల నీళ్లు తాగిస్తు న్నారు. మరి కొంతమంది ఎందుకురా తలనొప్పి అంటూ వారు కోరిన విధంగా ముట్ట చెబుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కొంతమంది యజమానుల నుంచి లక్షలాది రూపాయలు అధికారపార్టీకి చెందిన వ్యక్తులకు ముడుపుల రూపంలో ముట్టినట్లు ప్రచారంలో ఉంది.