Jun 15,2022 23:08

భవిత కేంద్రాల సేవలు విస్తృతం
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
విభిన్న ప్రతిభావంతులకు భవితకేంద్రాల ద్వారా అందించే సేవలను విస్తతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్‌ సమగ్రశిక్ష, విద్యాశాఖ, విభిన్న ప్రతిభావంతుల హిజ్రాల, వయోవద్ధుల సంక్షేమ శాఖ, డిఆర్‌డిఏ, ఐసిడిఎస్‌, అధికారులతో సంయుక్తంగా విభిన్న ప్రతిభావంతులకు అందిస్తున్న సేవలపై వారికి ప్రభుత్వం ద్వారా అందించే పథకాల లబ్ధికి సంబంధించి తీసుకోవలసిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులుగా ఉన్న వారిలో సదరమ్‌ సర్టిఫికెట్‌ రాని వారిని గుర్తించి వైద్యఆరోగ్య శాఖ, డిఆర్‌డిఏ, ఐసిడిఎస్‌ శాఖాలు సమన్వయం చేసుకొని సదరమ్‌ క్యాంప్‌లు నిర్వహించాలన్నారు. ఈ సదరమ్‌ సర్టిఫికెట్‌లు పొందిన అనంతరం ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో కేంద్రప్రభుత్వ పథకాల ద్వారా విభిన్న ప్రతిభావంతులు లబ్ధి పొందేందుకు స్వావలంబన పోర్టల్‌లో విభిన్న ప్రతిభావంతుల గుర్తింపు కార్డుల కొరకు అప్‌లోడ్‌ చేసే ప్రక్రియను సమగ్ర శిక్ష శాఖతో సమన్వయం చేసుకొని పూర్తి చేయాలని విభిన్న ప్రతిభావంతుల హిజ్రాల, వయో వద్ధుల సం క్షేమ శాఖ ఎడి శ్రీనివాస్‌ను ఆదేశించారు. విభిన్న ప్రతిభావంతులైన పిల్లలు సాధారణ పిల్లలతో సమానంగా విద్యను అభ్యసించేందుకు భవిత కేంద్రాలలో వారికి తగుశిక్షణ ఇవ్వడంతో పాటు వారికి పెయింటింగ్‌, చాక్‌పీసుల తయారీలో శిక్షణ ఇవ్వడం జరుగుతున్నదని సమగ్రశిక్ష అదనపు కో ఆర్డినేటర్‌ వెంకట రమణారెడ్డి కలెక్టర్‌కు వివరించారు. ఈసమావేశంలో డీఈఓ పురుషోత్తం, డిఆర్‌డిఏ పిడి తులసి, ఐసిడిఎస్‌ పీడీ నాగశైలజ సంబంధింత అధికారులు పాల్గొన్నారు.