Oct 19,2022 22:20

భూసమస్యల పరిష్కారానికే 'రీ సర్వే' : జెసి
ప్రజాశక్తి- పూతలపట్టు:
రాష్ట్రప్రభుత్వం రీసర్వే కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యమైందిగా భావిస్తోందని, ఈ కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి భూసమస్యలు లేకుండా చూడాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌. వెంకటేశ్వర్‌ తెలిపారు. జెసి మాట్లాడుతూ గ్రామాల్లోని రచ్చబండ వద్ద భూయజమానులు వారివారి భూముల విస్తీర్ణం వివరాలను గురించి తెలియజేయాలన్నారు. బుధవారం పూతలపట్టు, పెనుమూరు మండలాలలో రీసర్వే నిర్వహించిన తీరును పరిశీలించారు. క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్‌ ప్రక్రియ ఏవిధంగా జరిగిందని, ఈ ప్రక్రియలో ఏవైనా తప్పులు ఉంటే దిద్దుబాటు ఆప్షన్‌ రావడం జరిగిందని, దీనికి సంబంధించి వెంటనే పూర్తి చేసుకోవాలన్నారు. పూతలపట్టు మండలంలో సిద్ధలింగనపల్లి, వేపనపల్లి, గొడుగుచింత, తిప్పనపల్లి గ్రామాలలో రీసర్వే కార్యక్రమాలు నిర్వహించగా తిప్పనపల్లి మినహా మిగతా అన్ని గ్రామాలలో వెరిఫికేషన్‌ పూర్తి అయిందని సిబ్బంది జాయింట్‌ కలెక్టర్‌కు తెలిపారు. తిప్పనపల్లికి సంబంధించి మరో రెండు రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ఈసందర్భంగా జెసి వెరిఫికేషన్‌ ప్రక్రియ నిర్వహించిన తీరుతో పాటు వచ్చిన సమస్యల గురించి పరిశీలించారు. క్లరికల్‌ స్థాయిలో ఈసమస్యల పరిష్కారానికి చేపట్టిన చర్యలు గురించి జాయింట్‌ కలెక్టర్‌ సిబ్బందితో మాట్లాడారు. ప్రభుత్వం దిద్దుబాటుకు అవకాశం కల్పించిందని తప్పులు ఉంటే దిద్దుబాటు కార్యక్రమం పూర్తి చేసుకోవాలన్నారు. మ్యుటేషన్‌ మినహా మిగతా దిద్దుబాటు చర్యలకు అవకాశం కల్పించాలని ఈ కార్యక్రమాన్ని కూడా త్వరలో అవకాశం కల్పిస్తారని అన్నారు. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతోందని అయితే ఏవైనా తప్పులు జరిగినట్లయితే బాధ్యత వహించాల్సి వస్తుందంటూ ఎటువంటి తప్పులు లేకుండా భూరికార్డులను సంబంధించిన యజమానులకు అప్పగించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ విజయభాస్కర్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.