Sep 10,2022 23:02

భూరక్ష.. రీసర్వేతో
రైతుభూముల లెక్క.. పక్కా...
భూసమస్య పరిష్కారమే ధ్యేయం..!
రీసర్వే వేగవంతం: చిత్తూరు ఆర్డీవో
ప్రజాశక్తి- యాదమరి:

పట్టాదారుల పాసు పుస్తకాల్లో మార్పులకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ అన్నదాతలు కాళ్లు అరిగేలా సంవత్సరాల తరబడి ప్రదక్షిణలు చేస్తున్నారు. భూమి వివరాలు తప్పులు... సవరణలు... పట్టాదార్‌ పాసు పుస్తకం మార్పులు... రెవెన్యూ అధికారుల అవినీతి.... వెరసి పుడమి పుత్రులకు తప్పని తిప్పలుగా మారాయి... రీసర్వేతో రైతుల సమస్య పరిష్కారం కానుంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం ద్వారా భూసమస్యలు పరిష్కారం ధ్యేయం అని చిత్తూరు రెవెన్యూ డివిజనల్‌ అధికారి రేణుక పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఏళ్ల తరబడి అపరిస్కత భూసమస్యల పరిష్కారం నోచుకునేందుకు పైలెట్‌ ప్రాజెక్టులో చిత్తూరు డివిజన్‌లోని గుడిపాల, జీడినెల్లూరు మండలాల్లో రీసర్వే చేస్తున్నామన్నారు. ఈ సర్వేతో భూముల లెక్క పక్కాగా తీయాలని, ప్రతి ఎకరం భూమిని పూర్తిస్థాయిలో కొలిచి రైతులు అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. చిత్తూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 12 మండలాలు, 304 గ్రామాలు ఉన్నాయి. ఇప్పటివరకు 141 గ్రామాల్లో డ్రోన్‌ఫ్లై చేపట్టడం జరిగింది. ఇంకా 162 గ్రామాల్లో డ్రోన్‌ పై జరగాల్సి ఉంది. ఓఆర్‌ఐ షీట్స్‌ (ఆర్తో రిక్వైడ్‌ ఇమేజెస్‌) 20 గ్రామాలకు అందాయి. తొమ్మిది గ్రామాల్లో 13నోటిఫికేషన్‌ పూర్తిచేశాము. ఐదు గ్రామాలు గ్రౌండ్‌ ట్రూత్‌ పూర్తి చేసుకున్నాయి. ఆరు గ్రామాలు గ్రౌండ్‌ వాల్యుయేషన్ల్‌ జరుగుతున్నాయి. చిత్తూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 140గ్రామాల్లో 186557.68 ఎకరాల్లో డ్రోన్‌పై కంప్లీట్‌ చేయడం జరిగింది. 20 గ్రామాల్లో ఓఆర్‌ఐ సీట్స్‌ (ఆర్తో రెక్టిఫైడ్‌ ఇమేజెస్‌) వీటి ద్వారా ప్రతి రైతు పొలంలో సర్వేరు వీఆర్వోలు రెవెన్యూ సిబ్బందితో క్షేత్రస్థాయిలో రైతుల భూముల హద్దులు పరిశీలిస్తామన్నారు.
చిత్తూరు డివిజన్‌ పరిధిలోని పాప సముద్రం, సిద్ధ లింగన్నపల్లి, సిఎస్‌ అగ్రహారం, ఉత్తర బ్రాహ్మణపల్లి, పెరుమల కండ్రిగ, అగర మంగళం, చిగరపల్లి, కోట్లపల్లి, ముత్తుకూరుపల్లి, గ్రామాల్లో 13 నోటిఫికేషన్‌ పూర్తి చేశారు. అటు తర్వాత 9(2) నోటీసులు రైతులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ నోటీసులు అందుకున్న తర్వాత రైతులు వారికి ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఒక నెలరోజులు లోపల సంబంధిత తహశీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అభ్యంతరాలను ఇరువు రైతుల సమక్షంలో రెవెన్యూ సిబ్బంది పరిష్కరిస్తామన్నారు. రీసర్వే చేసిన గ్రామాల్లో ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే 13నోటిఫికేషన్‌ విడుదల చేసి ఫైనలైజ్‌ చేస్తారు. ఈసర్వే పూర్తి అయిన గ్రామాల్లో సచివాలయంలోని రైతుల భూములకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో అక్టోబర్‌ రెండు నాటికి భూహక్కు పత్రాలు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇద్దరు డిప్యూటీ ఇన్స్పెక్టర్లతో మహబూబ్‌ బాషా, గిరిప్రకాష్‌, సర్వేయర్లు ఈసర్వేలో పాల్గొంటున్నారు. మూడు విడతల్లో ఈసర్వే చేసి రైతులకు పక్కా హద్దులతో భూములను అప్పగించనున్నారు. సర్వే పూర్తి అయిన తర్వాత ఎలాంటి చిక్కులు లేని భూములను రైతులకు అప్పగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
సమగ్రంగా భూవివరాలు..
భూరక్షా భూహక్కు పథకం ద్వారా భూముల వివరాలు విస్తీర్ణం లెక్కలు కేంద్ర విభాగంలో నమోదు కానున్నాయి. ఈ నూతనసర్వే ప్రకారం కిందిస్థాయిలో భూములు అక్రమమార్గంలో రిజిస్ట్రేషన్లు చేసుకోవడం వంటివి ఇక ముందు కనిపించని అధికారులు చెబుతున్నారు. గ్రామస్థాయిలో భూమి పై భాగంలో డ్రోన్‌ తిరుగుతుండగా భూమిపై కాస్‌ నెట్వర్క్‌ పాయింట్‌ డ్రోన్‌ద్వారా సర్వే వివరాలు బేస్‌ స్టేషన్లకు అనుసంధానం అవుతుంది. ఆబేస్‌స్టేషన్‌ల నుంచి కేంద్ర ప్రభుత్వ సర్వేయర్లోకి భూముల సమాచారం అందుతుంది. దీంతో భూముల వివరాలు కేంద్ర సర్వే విభాగంలో నిక్షిప్తం అవుతాయి.
భూ ఆధార్‌తో ప్రతి రైతుకు ఒక ఎల్‌పిఎం నెంబర్‌
భూమి రీసర్వే అనంతరం ప్రస్తుతం ప్రతి మనిషికి గుర్తింపు సంఖ్య ఆధార్‌ నెంబర్‌ ఏవిధంగా ఉందో భూములకు సంబంధించి ఒక యూనిక్‌ నంబర్‌ రూపంలో ఒక సంఖ్య ఇస్తారని అధికారులు చెబుతున్నారు. ఆ ఎల్‌పిఎం నెంబర్లో ఒక రైతుకి ఎన్ని చోట్ల భూమి ఉన్న ఒక నెంబరు ద్వారానే ఆ భూములన్నింటి కలిపి ఒక గుర్తింపు నెంబర్‌ ఇస్తారు. ఆ యూనిక్‌ నెంబర్‌ ఆధారంగా భూముల వివరాలు నమోదవుతాయి. రైతుల వివరాలు ప్రభుత్వా కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి.
రీసర్వేతో రైతుల భూసమస్యలు పరిష్కారం
- రేణుక, ఆర్డీవో చిత్తూరు
మండల కేంద్రం నుంచి రెండు కిలోమీటర్ల వరకు అసైన్డ్‌ భూములుకు ఎవరికీ పట్టాలు ఇవ్వడం కుదరదు. మున్సిపాలిటీ పరిధిలో అసైన్మెంట్‌ భూములకు పట్టాలు ఇవ్వకూడదు. నిబంధనలు అతిక్రమించి పట్టాలు ఇస్తే అధికారులపై చర్యలు తప్పమన్నారు. చిత్తూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో రీసర్వే పక్కాగా చేపడుతున్నారు. ప్రతి ఎకరం సర్వే చేయడం జరుగుతుంది. భూముల రీసర్వేతో రైతులు భూయజమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. సర్వేపూర్తి అయిన తర్వాత భూ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారమవుతాయి.