భూఆక్రమణపై చర్యలు తీసుకోవాలి
ప్రజాశక్తి-పలమనేరు: వి.కోట మండలం తోటకనుమ గ్రామానికి చెందిన తలారి మునివెంకటప్ప భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకొని అడిగినందుకు ఆయన కుటుంబంపై దౌర్జన్యానికి పాల్పడిన కస్తూరి నగరానికి చెందిన బాలప్పపై వెంటనే చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కులు.. అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా నాయకులు డీవీ మునిరత్నం డిమాండు చేశారు. పలమనేరు కార్యాలయంలో బుధవారం వివిధ సంఘాల నాయకులతో పార్థసారధి అధ్యక్షతన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు డీవీ మునిరత్నం, వేలాయుధం, సోము మాట్లాడుతూ బాధితుడు మునివెంకటప్పకు చెందిన భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంపై బాధితుడు నెలలు తరబడి న్యాయం చేయమని సంబంధిత అధికారుల చుట్టూ తిరుగుతున్నారని వాపోయారు. బాధితుడి వద్ద భూమికి సంబంధించిన అన్ని రికార్డులు పకడ్బందీగా ఉన్నప్పటికీ భూమిలోకి రానివ్వకుండా అడ్డుపడుతున్న ఆక్రమణ దారుడు బాలప్పపై ఇప్పటివరకు ఎందుకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారో సమాధానం చెప్పాలన్నారు. బాధితునికి న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ప్రజా సంఘాలను సంఘటితం చేసి సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రవికుమార్, హేమలత, ఆనంద్, మణి బాలచంద్ర, రామ్మూర్తి నాయుడు, వెంకటేష్, రాజా, రమేష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు










