ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్
రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు అందజేస్తున్న అన్ని రకాల పౌర సేవలు సకాలంలో ప్రజలకు అందజేయాలన్నారు. శుక్రవారం ఉదయం జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) రాజాబాబు, మదనపల్లె ఆర్డీఓ మురళి లతో కలిసి జిల్లా కలెక్టర్ స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు అందజేస్తున్న వివిధ రకాల సేవల అమలుపై మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండల తహశీల్దార్లు, సర్వేయర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భూ సమస్యలకు సంబంధించి 22 అంశాలను తాహశీల్దార్లు, రీ సర్వే లోని 19 అంశాలకు సంబంధించి సర్వేయర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు, అప్పుడే భూ సమస్యలను పరిష్కరించడానికి వీలవుతుందన్నారు. పిఓ ఎల్ ఆర్ సంబంధించి ఫారం 1 నుండి 6 వరకు తహశీల్దార్లు పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే భూసమస్యలను త్వరగా పరిష్కరించేందుకు వీలవుతుందని అన్నారు. భూ సమస్యలకు సంబంధించి ప్రతి వారం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లతో చీఫ్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతున్నదన్నారు. వినతులను తిరస్కరించే ముందు ఒకటికి పదిసార్లు బాగా ఆలోచించుకొని నిర్ణయించాలని, అలా చేయని యెడల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు. వినతులను పరిష్కరించడంలో తహశీల్దార్లకు ఏమైనా సమస్యలు ఇబ్బందులు ఉంటే వాటిని కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల దష్టికి తీసుకురావాలని తెలిపారు. అప్పుడే సిసిఎల్‌ఎ ద్వారా పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వెబ్ ల్యాండ్ సంబంధించిన పిటిషన్ ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తహశీల్దార్లు ను ఆదేశించారు. తహశీల్దార్లు, సర్వేయర్లు సమన్వయం చేసుకొని భూసమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని వారికి సూచించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి.రాజా బాబు మాట్లాడుతూ మండల తహశీల్దార్లు భూసమస్య అర్జీలను తిరస్కరించే ముందు బాగా ఆలోచన చేయాలన్నారు. పిఓ ఎల్ ఆర్, భూ రిసర్వే పై ప్రభుత్వం ఎక్కువ దష్టి పెట్టి సమావేశం నిర్వహిస్తోందని తెలిపారు. పుంగనూరు నియోజకవర్గం సదుం మండల పరిధిలోని బూరగమంద, 79 చింతమాకుల పల్లె, చెరుకువారి పల్లె, తుమ్మినేని పల్లి పంచాయతీలలో, తంబళ్లపల్లి నియోజకవర్గం, తంబళ్లపల్లి మండలంలోని ఎర్రసానిపల్లి, సరిమడుగు, కన్నెమడుగు, కండ్లమడుగు, పంచాలమర్రి పంచాయతీలలో జరుగుతున్న వై.ఎస్.ఆర్ జగనన్న భూసర్వే భూరక్ష పధకం నిర్వహణను వేగవంతగా పూర్తి చేయాలని సంబందిత సర్వేయర్ల ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎడి. జయరాజ్ పాల్గొన్నారు.










