ప్రజాశక్తి- యాదమరి: మండలంలోని భూసమస్యల పరిష్కరించేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు తహశీల్దార్ హనుమంతు తెలిపారు. ఆయన ప్రజాశక్తి వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. మండలంలోని భూమికి సంబంధించిన సమస్యలను రెవెన్యూ సిబ్బంది రైతులతో చర్చించి వారి వద్ద ఉన్న రికార్డులను, క్షేత్రస్థాయిలో పరిశీలించి అనంతరం తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ప్రజాశక్తి : మండలంలో ఎన్ని రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి? ఎంత భూమి ఉంది?
తహశీల్దార్: మండలంలో 24 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఇందులో మొత్తం 380 907 ఎకరాల భూములు ఉన్నాయి .అందులో ఫారెస్ట్ భూములు 13091 ఎకరాలు ఉన్నాయి.
ప్రజాశక్తి : ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి.. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
తహశీల్దార్: ప్రభుత్వ భూములు ఇతర ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలని గ్రామ రెవెన్యూ అధికారులకు, వీఆర్‌ఏలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రజాప్రయోజనాలకు ఉద్దేశించే రహదారులు, చెరువులు, చెట్లు, ప్రభుత్వం చెందిన ఇతర ఆస్తులు పరిరక్షణ ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమణకు పాల్పడిన వారిపై రెవెన్యూ చట్టప్రకారం కేసులు నమోదు చేస్తాం. ప్రభుత్వ భూములు ను ఎవరైనా ఆక్రమిస్తే గ్రామాల్లోని ప్రజలు ఫిర్యాదు చేయాలన్నారు.
ప్రజాశక్తి : మండలంలో జగనన్న లేఅవుట్లు కాలనీలు ఎన్ని వేశారు, ఎంతమందికి పట్టాలిచ్చారు?
తహశీల్దార్: మండల పరిధిలో జగనన్న కాలనీలో లేఅవుట్లు 16 గ్రామపంచాయతీలో ఏర్పాటు చేశాం. అందులో అర్హులైన వారికి 810 మందికి పట్టాలు మంజూరు చేశాం. గ్రామీణ ప్రాంతాల్లో జగనన్న ఇల్లు మంజూరు అయిన వారికి సర్టిఫికెట్లు అన్ని 1633 మంజూరు చేశాం. కోనపల్లి గ్రామ పంచాయతీలో వేసిన లేఅవుట్లు కోర్టుకేసు వల్ల పెండింగ్‌లో ఉంది. అది క్లియర్ అయితే అర్హులైన వారికి అందిస్తాము.
ప్రజాశక్తి : వైయస్సార్ జగనన్న రీ సర్వే గ్రామాల్లో జరుగుతుంది.?
తహశీల్దార్: వైయస్సార్ జగనన్న భూ రీసర్వే మొదటి విడతగా కొట్టాలం, డీకే చెరువు, మోడీపల్లి గ్రామాల్లో జరిగింది. పూర్తిస్థాయిలో సర్వే రాళ్లు నాటి రైతులకు రికార్డులు అందించాం. రెండో విడత రీసర్వేలో 186 నడింపల్లి, మజార కొత్తపల్లి, కమ్మపల్లి, జంగాలపల్లి, మాధవరం, ఓటివారిపల్లి గ్రామాల్లో రీసర్వే చేపట్టాం. సర్వేరాళ్లు 90శాతం నాటి కార్యక్రమం పూర్తిఅయ్యింది. మూడవ విడత రీసర్వే కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ గ్రామాల్లో గ్రామ కంఠాలు గుర్తింపు, ప్రభుత్వముల గుర్తింపు, గ్రామ సరిహద్దు రాళ్లు, చున్న మార్కింగ్ పూర్తి చేసాం.
ప్రజాశక్తి : అసైన్మెంట్ కమిటీలో ఎంతమంది రైతులకు అవకాశం కల్పించారు.?
తహశీల్దార్: ప్రభుత్వం చేపడుతున్న అసైన్మెంట్ కమిటీలో మండలంలోని సాగు చేసుకుంటున్న సుమారు 72 మంది రైతులకు గాను సుమారు 120 ఎకరాలకు పైగా అసైన్మెంట్ కమిటీలో నమోదు చేశాం. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు గతంలో అసైన్మెంట్ కమిటీలో నమోదు కాని అర్హులైన రైతులు రెండవ విడత అసైన్మెంట్ కమిటీలో పేర్లు నమోదు చేసుకోవాలి. ఈఅవకాశాన్ని మండలంలోని అర్హులైన ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలి.










