భూ సేకరణకు సహకరించండి : జేసీ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల స్థలాలను కేటాయించడానికి ప్రభు త్వం ముందుకొచ్చిందని, ఇందుకు సంబంధించి చిత్తూరు పరిసరాల్లో, పూతలపట్టు సమీపంలో భూ సేకరణ చేయాలని నిర్ణయించిందనిఅందరూ సహక రించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అన్నారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ తన కార్యాలయంలోని సమావేశ మందిరంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు నగరం సమీపంలో ఉన్న కోడిగుట్టపల్లి వద్ద 35 ఎకరాలు చుడ (చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) అధ్వర్యంలో సమీపంలోని వడ్డేపల్లి వద్ద 26.3 ఎకరాలు సేకరించాలని భావించామని, ఇందుకు సంబంధించి రైతుల అభిప్రాయం తెలియజేయాలనికోరారు. చిత్తూరు సమీపంలో 63 లక్షల రూపాయలు ధరను నిర్ణయించామని, దీంతోపాటు ఇతర కట్టడాలు లేదా పైప్ లైన్లు వంటి వాటికి అదనపు పరిహారం ఇవ్వడం జరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా రైతుల మనోగతం తెలియజేయాలని, ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించారన్నారు. పూతలపట్టు మండలంలోని వడ్డేపల్లి రోడ్డుకు సంబంధించి జాతీయ రహదారి పక్కనే 26.3 ఎకరాలు గుర్తించడం జరిగిందని, దీనికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ విధానంలో భూ సేకరణ చేయాలని, ఒక్కో రైతుకు ఎకరాకు 8100 అడుగులు (900గజాలు) ఇవ్వడం జరుగుతుందని వివరించారు. భూములు ఇచ్చిన తర్వాత చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు అన్ని అభివద్ధి కార్యక్రమాలు ఆ స్థలంలో చేసి సంబంధిత రైతులకు రిజిస్టర్ చేసి ఇవ్వగలమని జాయింట్ కలెక్టర్ వారికి తెలిపారు. మరో వారం రోజులు పాటు ఆలోచించుకొని నిర్ణయాన్ని అధికారులకు వివరించాలని క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటిస్తారని వివరించారు. ఈ సందర్భంగా ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమి ఇవ్వడం ద్వారా రైతులకు జరిగే మేలును పూతలపట్టు తహశీల్దార్ వివరించారు. ఈ కార్యక్రమంలో చుడ వైస్ చైర్మన్ విశ్వనాధ్, చిత్తూరు ఆర్డీవో రేణుక, పూతలపట్టు తహశీల్దార్ విజయభాస్కర్ సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.










