Mar 30,2022 22:05

'భారం' తప్పదు..!
- 75 యూనిట్లు దాటితే రూ.1.40 అధికం
- ఎపిఇఆర్‌సి ఛైర్మన్‌ నాగార్జునరెడ్డి వెల్లడి
ప్రజాశక్తి-తిరుపతి సిటి

'తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్‌ భారం వేయక తప్పడం లేదు' అని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి ఛైర్మన్‌ (ఎపిఇఆర్‌సి) జస్టిస్‌ సివి నాగార్జునరెడ్డి తమ నిర్ణయాన్ని వెల్లడించారు. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యుత్‌ టారిఫ్‌ను ప్రకటిస్తూ, పెంచిన విద్యుత్‌ ఛార్జీలు ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించారు.
ఎస్వీయూ సెనెట్‌ హాలులో ఆయన మాట్లాడుతూ ఇరవై ఏళ్లుగా విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదని, తప్పరిసరి పరిస్థితుల్లో పెంచుతున్నామని, కేవలం గృహ వినియోగదారులే లక్ష్యంగా ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. సమతూకం అని చెబుతూనే పేద, మధ్యతరగతి ప్రజలపైనే అధికంగా భారాన్ని మోపారు. 75 యూనిట్లు దాటితే యూనిట్‌కు 1.40 రూపాయల చొప్పున, 125 యూనిట్లు దాటితే యూనిట్‌కు రూ.1.57 చొప్పున ధరలు పెంచారు. విద్యుత్‌ పంపిణీ సంస్థలు 2022-23 ఆర్ధిక సంవత్సరానికి మొంత్తం ఆదాయ అవసరాలు, ధరల ప్రతిపాదన ద్వారా 10,932.99 కోట్ల లోటు, గృహ వినియోగదారులకు ధరల పెంపు ప్రతిపాదనలతో 10,045.61కోట్ల లోటుతో మొత్తం 45,398.66 కోట్లగా ఉందని అంచానా వేశారు.కోవిడ్‌ 19 దృష్ట్యా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ నికర లోటును భర్తీ చేయడానికి అన్ని వర్గాల వినియోగదారులకు ధరలను సహేతుకమైన స్థాయిలో ఉంచడానికి రాష్ట్ర ప్రభుత్వం 11,123.21 కోట్ల రాయితీ ఇవ్వడానికి అంగీకరించిందన్నారు. 2022-23 సంవత్సరానికి కేటగిరి 'వి' అగ్రికల్చర్‌-ఎల్‌టి కింద ఉచిత విద్యుత్‌ సరఫరాకు అర్హులైన వినియోగదారకలు సంబంధించిన 9,513 కోట్ల రాయితీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు.
150 హెచ్‌పి వరకు పరిశ్రమలకు అనుమతి
ప్రస్తుతం రైస్‌మిల్స్‌, పల్వరైజింగ్‌ మిల్లులు ఎల్‌టి సరఫరా కింద 100 హెచ్‌పి నుంచి 150 హెచ్‌పి వరకు ఎలాంటి ధరలుపెంపు లేకుండా పరిశ్రమలకు అనుమతి ఇచ్చామన్నారు. గ్రానైట్‌ ప్యాక్టరీలు తదితర సంస్థల వినతి మేరకు ఈ నిర్ణయాన్ని వారికి వర్తింప చేశామన్నారు.
కార్పొరేట్‌ రైతు నిర్వచనం మార్పు
కార్పొరేట్‌ రైతు నిర్వచనాన్ని మండలి మార్చిందన్నారు. కొత్త నిర్వచనం ప్రకారం కార్పొరేట్‌ రైతు అంటే కంపెనీల చట్టం 2013 లేదా, మునుపటి కంపెనీ చట్టం కింద ఏర్పాటు చేయబడిన వ్యవసాయాన్ని ఒక కార్యాకలాపంగా చేపట్టే ఒక సంస్థ, భాగస్వామ్య సంస్థ. ఒక పరిమిత బాధ్యత కలిగిన బాగస్వామ్య సంస్థ, రిజిస్టర్డ్‌ అసోసియేషన్‌ ఆప్‌ పర్సన్స్‌, కో ఆపిరేటివ్‌ సొసైటీల వ్యవసాయం చేపట్టే వ్యక్తుల రిజిస్టర్డ్‌ అసోసియేషన్‌ కింద ఉన్న వారిని కార్పొరేట్‌ రైతులుగా గుర్తిస్తామన్నారు.
గోశాలకు, ప్రార్దన మందిరాలకు
ప్రస్తుతం గోశాలలు కేటగిరీ4-సి కింద బిల్లు చేయబడుతున్నాయి. గోశాలను కేటగిరి 5(బి) కింద చేర్చాలని మండలి అభ్యర్ధన మేరకు దీంతో గోశాలను తక్కువ టారిఫ్ల కిందకు తీసుకొచ్చామన్నారు. ప్రార్ధన మందిరాలకు తక్కువ టారిప్‌ను అందించామన్నారు.
గృహ వినియోగదారులకు
0-30 యూనిట్ల వరకు రూ.1.45 పైసలు ఉన్నదాన్ని రూ.190కి అంటే యూనిట్‌కు 0.45పైసలు పెంపు. 31నుంచి 75 యూనిట్లకు గతంలో రూ.2.09 ఉంటే .091పైసలు పెంచి మూడు రూపాయులు, 76 నుంచి 125 యూనిట్ల వరకు రూ.3.10 ఉంటే రూ.140 పెంచి రూ.4.50 పైసలు, 126 నుంచి 225 వరకు రూ.4.43 ఉంటే రూ.1.57 పెంచి యూనిట్‌కు రూ.6గా పెంపు. 226 నుంచి 400 యూనిట్ల వరకు రూ.75 ఉంటే రూ.1.16పైసలు పెంచి రూ.8.75 పైసలు, 400పైగా యూనిట్లు వినియోగించే వారికి ప్రస్తుతం రూ.9.20 ఉంటే 0.55పైసలు పెంచి రూ.9.75 పైసలుగా నిర్ణయించామని తెలిపారు.