Apr 03,2022 22:59

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు చూపుతున్న పోలీసులు


అంతర్జాతీయ స్మగ్లర్లు అరెస్ట్‌
ప్రజాశక్తి-ఎస్‌ఆర్‌పురం:
మండలంలోని పుల్లూరురోడ్‌లో పుల్లూరు దళితవాడకు సమీపంలో తెల్లజామున నాలుగు గంటల ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానస్పదంగా ఉన్న ఒక వాహనంను తనిఖీ చేయగా ఇద్దరు అంతర్జాతీయ స్మగ్లర్లతో పాటు, ఒక వాహనం, అక్రమంగా తరలిస్తున్న 6 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చిత్తూరు అడిషనల్‌ ఎస్పి(అడ్మిన్‌) మహేష్‌, పుత్తూరు డిఎస్పి యశ్వంత్‌ మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమరవాణాపై డిఐజి సెంథిల్‌కుమార్‌ ఆదేశాల మేరకు జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌ఇబి విద్యాసాగర్‌ నాయుడు సూచనలతో ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు, నిఘాను పెంచామన్నారు. ప్రత్యేక బృందాల వాహన తనిఖీల్లో ఇప్పటికే ఎర్రచందనంను స్వాధీనం చేసుకుని, స్మగ్లర్లను అరెస్ట్‌ చేయడం జరిగిందన్నారు. పుల్లూరు దళితవాడకు సమీపంలో ఎస్‌ఆర్‌పురం ఎస్‌ఐ షేక్షావలి సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న ఒక వాహనం తనిఖీ చేయగా తమిళనాడు వేలూరు జిల్లాకు చెందిన ఇద్దరు అంతర్జాతీయ స్మగ్లర్లు పి.ప్రవీణ్‌కుమార్‌ (34) రాజ్‌ కుమార్‌ (28)ను అదపులోకి తీసుకున్నారు. వాహనం సహా 6 ఎర్రచందనం దుంగలను స్వాదీనం చేసుకోని కేసు దర్యాప్తును ప్రారంభించామన్నారు. పట్టుబడ్డ స్మగ్లర్లు అంతర్జాతీయ స్థాయిలో ఎర్రచందనం అక్రమంగా రవాణా చేసే వారిగా గుర్తించామన్నారు. స్మగ్లర్లు ఇచ్చిన సమాచారంతో ఏర్పేడు మండల పరిధిలోని సధాశివకోనకు వెళ్లు మార్గంలో 113 దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. స్వాధీనం చేసుక్నున 119 ఎర్రచందనం దుంగలు 3,298.5 కేజీలుగా ఉన్నాయని, విలువ కోటి 69 లక్షలుగా ఉంటుందన్నారు. ఎస్‌ఐ షేక్షావలి, సిబ్బంది పనితీరు అభినందనీయమన్నారు. పట్టుబడ్డ అంతర్జాతీయ స్మగ్లర్ల నుంచి వివరాలను తెలుసుకొని, వారిని అరెస్ట్‌ చేస్తామన్నారు. వీరిపై జీడీ నెల్లూరు పోలీస్‌ స్టేషన్లో 2, సత్యవేడు పోలీస్‌స్టేషన్లో రెండు కేసులు ఉన్నాయన్నారు. ఈ కేసులో ఇంకా 11 మందిని అరెస్ట్‌ చేస్తామన్నారు. ఎస్‌ఐ షేక్షావలి, సిబ్బందిని అభినందిస్తూ రివార్డులు ప్రకటించారు.