Apr 26,2023 08:31

అనంతపురం నగరంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.బాబురావు

       అనంతపురం కలెక్టరేట్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోయలేని పన్నుల భారాలు మోపుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.బాబురావు తెలిపారు. మంగళవారం ఆయన అనంతపురం సిపిఎం 1వ నగర కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని పలు వార్డుల్లో పర్యటించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో ప్రజలపై భారాలు పడుతున్నాయని తెలిపారు. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర సరుకులు ధరలు పెంచి ప్రజల నడ్డి విడుస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటి, చెత్త పన్నులు, విద్యుత్‌ ఛార్జీలను విపరీతంగా పెంచేసిందన్నారు. భారాలతో ప్రజల ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారి పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తోపుడు బండ్లు మీద వ్యాపారం చేసుకుంటున్న చిన్నచిన్న వ్యాపారస్తుల నుంచి మున్సిపాల్టీ రోజుకు రూ.పది నుంచి రూ.50 దాకా సుంకాన్ని వసూలు చేస్తున్నారని చెప్పారు. ఈ పన్నుల భారాలను తగ్గించాలని సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్నట్లు చెప్పారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా, ఇప్పటికీ మంచి నీటిని సరఫరా చేయలేని పరిస్థితిలో ప్రభుత్వాలు ఉండడం సిగ్గుచేటన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మందికి రేషన్‌ కార్డులు లేవన్నారు. ప్రభుత్వం కట్టిస్తున్న జగనన్న ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదన్నారు. ప్రజల సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర 1వ కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి, కమిటీ సభ్యులు ప్రసాద్‌, ప్రకాష్‌, మసూద్‌, వెంకటేష్‌, బాబూ, మధ్య తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు శ్రీనివాసరావు, శాఖా కార్యదర్శులు అంజి, మోహన్‌, ఫయాజ్‌, వలీ, పీరా పాల్గొన్నారు.