Apr 18,2023 17:30

ప్రజాశక్తి - కాళ్ల
ఎండలు మండుతున్నాయి. ఒక్కపక్క ఉక్కపోత, మరో పక్క అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణుల అవస్థలు వర్ణణాతీతం. వారం రోజుల నుంచి పగటిపూట ఉష్ణోగ్రతలు సగటున 36 నుంచి 38 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. మధ్యాహ్న సమయంలో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో పనులు చేసుకునేవారు, బాటసారులు దాహార్తితో అలమటిస్తున్నారు. గత వేసవిలో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు, నాయకులు చలివేంద్రాలు నెలకొల్పారు. ఈ ఏడాది ఇంకా ఎక్కడా కానరావడం లేదు.
ప్రధాన కూడళ్లలో ప్రజల అవస్థలు...
ఏటా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారు. బస్టాండు, పంచాయతీ, పోలీస్‌స్టేషన్‌, జువ్వలపాలెం, కలవపూడి, బొండాడ కోలనపల్లి రోడ్డు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడంతో బాటసారులు దాహార్తిని తీర్చుకునేవారు. ఈ ఏడాది మాత్రం ఆ ఊసే లేదు. మార్చి నుంచే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా గ్రామ పంచాయతీ అధికారులు తమకేమీ తెలీదన్నట్లు వ్యవహరిస్తున్నారు.అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఇదే పరిస్థితి.
కనిపించని ప్రచారం..
మండలంలో పగటి పూట ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. వేడి గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించాలి. ఈ కాలంలో వచ్చే వ్యాధులపై అప్రమత్తం చేయాలి. అయితే ఎక్కడా అలాంటి కార్యక్రమాలు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు కరపత్రాలు పంపిణీ చేయాల్సి ఉండగా అలాంటివి ఎక్కడా జరగకపోవడం శోచనీయం.
ఆకివీడు: రెండు రోజులుగా పెరిగిన ఎండ తీవ్రతకు ప్రజలు విలవిల్లాడుతున్నారు. దీంతో ఉదయం 11 గంటల నుంచి జనం రోడ్లపైకి రావడానికి బెంబేలెత్తుతున్నారు. ఉద్యోగులు, పరీక్షలు రాస్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకూ రోడ్లన్నీ ఖాళీ అయిపోతున్నాయి. దీంతో రాత్రి పది గంటల వరకు మార్కెట్‌ కళకళలాడుతోంది. ఏప్రిల్‌లోనే ఎండలు ఈ స్థాయిలో ఉంటే మేలో ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పాలకొల్లు: నియోజకవర్గంలో వారం రోజులుగా ఎండ ప్రభావం ఎక్కువగా ఉంది. అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు రాని పరిస్థితి నెలకొంది. ఏప్రిల్‌లోనే రోహిణి కార్తెలా ఉందని, మే లో ఇంకెలా ఉంటుందోనని జనం భయ పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు బయట తిరగడానికి భయపడుతున్నారు. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. వ్యాపారులు మధ్యాహ్న సమ యంలో షాపులు కట్టేసి తిరిగి సాయంత్రమే తెరుస్తున్నారు.