Sep 23,2022 22:52

గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల నిరసన

ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్‌
బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు శనివారం స్థానిక సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు, కష్ణా జిల్లాలకు చెందిన గ్రామీణ బ్యాంక్‌ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకులను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని, ఇతర వాణిజ్య బ్యాంకు ఉద్యోగులకు సమానంగా సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని, ఏండ్ల తరబడి పనిచేస్తున్న మెసెంజర్లను రెగ్యులరైజ్‌ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల పోరాటానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య, నాయకులు సురేంద్ర సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఉద్యోగ, కార్మికులు ప్రజల సహకారంతో ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సప్తగిరి గ్రామీణ బ్యాంకు రిటైర్డ్‌ స్టాప్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పిఎల్‌ ఆనంద్‌ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని గ్రామీణ బ్యాంక్‌ ఉద్యోగులు ఈ రోజు సమ్మె లో పాల్గొనడం జరిగిందన్నారు. ప్రైవేటీకరణ వల్ల బ్యాంకులు చాలా నష్ట పోయే ప్రమాదం ఉందన్నారు. బ్యాంకులు ప్రైవేటీకరణ అయితే రైతులకు పంట రుణాలు, మహిళలకు డ్వాక్రా రుణాలు ఇచ్చే సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడతారన్నారు. ఈ ధర్నాలో సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు వి వెంకటేశ్వరరావు ,అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఎస్‌ అశోక్‌ కుమార్‌, సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు హరి, శశి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, సప్తగిరి గ్రామీణబ్యాంక్‌ క్యాజువల్‌ స్వీపర్స్‌ అండ్‌ మెసెంజర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి రాజేష్‌ డిమాండ్‌ చేశారు.