
* ఎంపీ బెల్లానకు ఎచ్చెర్ల బాధ్యతలు అప్పగింత
* మెత్తబడిన గొర్లె కుటుంబసభ్యులు
* ససేమిరా అంటున్న అసమ్మతి నాయకులు
* ఎమ్మెల్యే కిరణ్ కోసం పనిచేయలేమని స్పష్టీకరణ
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: ఎచ్చెర్ల నియోజకవర్గ వైసిపిలో అసమ్మతి పోరు పార్టీకి తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ వ్యతిరేక స్వరాలు క్రమేణా పెరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్కడ పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉంది. ఇదే కొనసాగితే ఈ సీటును కోల్పోవడం ఖాయమన్న భావన పార్టీలో నెలకొనడంతో, దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ను రంగంలోకి దించింది. అసమ్మతి నాయకులను బుజ్జగించి పార్టీ పరిస్థితిని చక్కదిద్దాలని సూచించింది. దీంతో ఎంపీ చంద్రశేఖర్ ఎమ్మెల్యే కిరణ్ వ్యతిరేకీయులు ఒక్కొక్కరితో మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది చూడాల్సి ఉంది.
ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మూడేళ్లుగా తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ఇటీవల అవి మరింత పతాక స్థాయికి చేరుకున్నాయి. జగన్ ముద్దు... ఎమ్మెల్యే వద్దంటూ రోడ్డెక్కిన పరిస్థితికి వచ్చింది. పార్టీలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులను చక్కదిద్దేందుకు విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ను అధిష్టానం పంపడంతో, ఆయన బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టారు. చీపురుపల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి మండలాల వారీగా ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం నాయకులను పిలిచి మాట్లాడడం మొదలుపెట్టారు. ఎంపీ చంద్రశేఖర్ ఆహ్వానాన్ని ఎమ్మెల్యే కుటుంబసభ్యులు మినహా మిగిలిన అసమ్మతి నాయకులు సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. తొలుత ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ బావమరిది పిన్నింటి సాయి, కంది నానిని గత నెల 30న చీపురుపల్లి కార్యాలయానికి పిలిచి మాట్లాడారు. తనకు తీవ్ర అన్యాయం జరిగిందని, పార్టీ కోసం రూ.70 లక్షల వరకు ఖర్చు చేశానని ఎంపీ వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆ డబ్బులను ఎమ్మెల్యే ఇచ్చేస్తారంటూ ఎంపీ చెప్పినట్లు భోగట్టా. 'చిన్న శ్రీను వచ్చి ఏం ప్రయోజనం. సొంత బావమరిదివి, నువ్వు కావాలనే అప్రతిష్ట చేస్తున్నావు' అని ఎమ్మెల్యే కిరణ్ అన్నట్లు తెలిసింది. ఎంపీ చంద్రశేఖర్ మాట్లాడిన తర్వాత కుటుంబ సభ్యులు మెత్తబడినట్లు సమాచారం.
అసమ్మతి నాయకులు ససేమిరా
నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అసమ్మతి నాయకులంతా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కిరణ్‌కుమార్ అభ్యర్థిత్వాన్ని ససేమిరా అంటున్నారు. ఎచ్చెర్ల నాయకులు జరుగుళ్ల శంకరరావు, బల్లాడ జనార్థనరెడ్డిని చీపురుపల్లి రమ్మని కబురు పంపారు. వారు అందుకు నిరాకరించి ఎమ్మెల్యే కిరణ్‌కు టిక్కెట్ రాకుండా చేద్దాం. వ్యతిరేకించాలని మీరే చెప్పారని, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటని వారు బదులిచ్చినట్లు సమాచారం. లావేరు మండలానికి చెందిన లుకలాపు అప్పలనాయుడుకు కబురు పంపారు. పిఎసి అధ్యక్ష పదవి ఇస్తామని, ఎమ్మెల్యే గ్యాప్ ఎందుకని సహకరించాలని సూచించడంతో చూద్దామంటూ బదులిచ్చినట్లు తెలిసింది. జి.సిగడాం మండల నాయకుడు బూరాడ వెంకటరమణతోనూ మాట్లాడారు. ఎమ్మెల్యే కిరణ్‌కు టికెట్ ఇస్తే పార్టీకి పనిచేయలేనని, అలాగని పార్టీ మారనని స్పష్టం చేసినట్లు సమాచారం.
పొరుగు జిల్లా నేతల రాజకీయ క్రీడ
ఎచ్చెర్ల నియోజకవర్గంలో నెలకొన్న అసమ్మతి పోరు పొరుగు జిల్లా వైసిపి నేతలకు రాజకీయ క్రీడగా మారింది. ఎచ్చెర్లలో పాగా వేసేందుకు ఎవరికి వారే తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయనగరం జిల్లాలోని కాపు సామాజిక తరగతి ప్రాబల్యం ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ బొత్స కుటుంబమే ప్రాతినిధ్యమే వహిస్తోంది. దీంతో విజయనగరం జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఎచ్చెర్ల నుంచి పోటీ చేయాలని భావిస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో ఇక్కడ పార్టీలో నెలకొన్న విభేదాలను తనకు అనుకూలంగా మార్చుకుని బరిలో దిగేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బుజ్జగింపులు బాధ్యత తీసుకున్న ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అసమ్మతిని తగ్గించే ప్రయత్నం చేయడం, ఎవరూ వినకపోతే తానే రంగంలోకి దిగాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు తన మేనల్లుడు చిన్న శ్రీనుతో కుటుంబపరంగా తీవ్ర విభేదాలు నెలకొన్నట్లు చర్చ నడుస్తోంది. పైగా విజయనగరం జిల్లాలో చిన్న శ్రీను ప్రాబల్యం అంతకంతకూ పెరిగిపోతుండడంతో చిన్న శ్రీను ఆధిపత్యం తగ్గించాలని చూస్తున్నట్లుగా తెలిసింది. చిన్న శ్రీనుకు చెక్ పెట్టేందుకు ఎచ్చెర్లలో గొర్లె కిరణ్‌కుమార్‌కు గానీ బెల్లాన చంద్రశేఖర్‌కు గానీ మద్దతు పలకాలని చూస్తున్నట్లు తెలిసింది. బెల్లానను ఎమ్మెల్యే బరిలోకి దింపి, విజయనగరం ఎంపీ సీటుకు తన సతీమణి బొత్స ఝాన్సీని రంగంలోకి దించాలని బొత్స యోచిస్తున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.