బతుకు పోరాటం
పొట్టకూటి కోసం ఆరాటం
వర్షాలతో భవన నిర్మాణ
కార్మికుల వెతలు
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్
రెండేళ్లపాటు కరోనా కష్టాలను ఎదుర్కొన్న భవన నిర్మాణ కార్మికులు ప్రస్తుతం వర్షాలతో పనులు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి. జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరానికి ఉదయాన్నే పనికోసం చిత్తూరు పరిసర మండలాలు యాదమరి, జీడీ నెల్లూరు, పెనుమూరు, బంగారుపాల్యం, తవణంపల్లి, పూతలపట్టు, గుడిపాల, చిత్తూరు రూరల్ మండలాల నుంచి పెద్దసంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు వస్తుంటారు. పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో గ్రామీణ ప్రాంతాల నుండి వస్తున్న భవన నిర్మాణ కార్మికులు పనిలేక తిరిగి ఇంటికి వెళ్లాల్సి వస్తోంది. కరోనా కాలంలో భవన నిర్మాణాలు ఆగిపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భవన నిర్మాణ రంగంపై వర్షాలు తీవ్రప్రభావం చూపుతున్నాయి. వర్షం పడింది అంటే భవన నిర్మాణ కార్మికులకు పనిలేకుండా పోతోంది.
చిత్తూరు పరిసర మండలాల నుండి పనికోసం ప్రతిరోజు 300 మందికి పైగా భవన నిర్మాణ కార్మికులు వస్తుంటారు. వీరికి ఆరోజు కూలి దొరికితేనే జీవనం. ఈనేపథ్యంలో వర్షాలతో నిర్మాణాలు ఆగిపోవడం వల్ల వీరి కుటుంబాలకు పూట గడవడం కూడా కష్టంగా మారింది.
ఆదుకోని ప్రభుత్వం..
కరోనా వలన చితికిపోయిన భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని ప్రకటన చేసిన ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఈ రంగాన్ని నమ్ముకొని పనిచేస్తున్న రోజువారి కూలీల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. భవన నిర్మాణ కార్మికుల ఆదుకుంటామని హామీ ఇచ్చిన ప్రభుత్వం వారి సంక్షేమం కోసం ఏమాత్రం నిధులు కేటాయించలేదు. దీంతో కార్మికశాఖలో భవన నిర్మాణ కార్మికులుగా గుర్తింపు కార్డులు పొందిన వేలాది మంది కార్మికులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
అన్ని రంగాలు కోలుకున్నా...
కరోనా తదనంతరం పరిణామాలతో అన్ని రంగాలు కొంతమేరకు కోలుకుని నిలదొక్కుకున్నప్పటికీ భవన నిర్మాణ రంగం మాత్రం పాలకుల నిర్లక్ష్యంతో కొట్టుమిట్టాడుతోంది. పారదర్శకత పేరుతో తీసుకొచ్చిన కొత్త ఇసుక విధానం తలాతోకా లేని నిర్ణయంగా మారి కార్మికుల పొట్ట కొడుతోంది. ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో నిర్మాణ రంగం కుంటుపడటంతో పరోక్షంగా ఈ ప్రభావం లక్షలాది కార్మికుల జీవితాలపై ప్రభావం చూపుతోంది.
భవన నిర్మాణ రంగం కుదేలు..
కార్మిక శాఖ లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో రెండు లక్షలకు పైగా భవన నిర్మాణ కార్మికులు ఉంటారని అంచనా. కార్మిక శాఖ దాదాపు లక్షకుపైగా భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డులు జారీ చేసింది. కరోనా సమయంలో ఆర్థిక సాయం అందిస్తామంటూ పెద్దసంఖ్యలో భవన నిర్మాణ కార్మికులకు బ్యాంకు ఖాతాలు తెరిపించి గుర్తింపు కార్డులు మంజూరు చేసింది. కరోనా తగ్గాక భవన నిర్మాణ కార్మికులను పట్టించుకోకపోవడంతో కార్మికశాఖ ద్వారా పొందిన గుర్తింపు కార్డులు అలంకార ప్రాయంగా మారాయి. దీంతోపాటు భవన నిర్మాణ కార్మికులకు అందించే ప్రమాద బీమా క్లయిమ్‌లు వందల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. కరోనా ప్రభావం, ఇసుక కష్టాలు, వర్షాలతో ఉపాధి లేక అల్లాడుతున్న భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. వర్షాల సమయంలో పనిలేని భవన నిర్మాణ కూలీలకు ఉచితంగా బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని భవన నిర్మాణ కార్మికుల సంఘాల నాయకులు, కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.










