Apr 12,2023 20:49

ప్రజాశక్తి - భీమవరం
సమసమాజ స్థాపన కోసం జీవితాన్ని ధారపోసిన మాకినేని బసవపున్నయ్య జీవితం స్ఫూర్తిదాయకమని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అన్నారు. మాకినేని బసవపున్నయ్య వర్థంతి స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బలరాం మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు ఉద్యమంలో అగ్రశ్రేణి నాయకుల్లో బసవపున్నయ్య ఒకరున్నారు. గుంటూరు జిల్లాలో పుట్టిన బసవపున్నయ్య విద్యార్థి దశ నుంచే దేశభక్తిని అలవర్చుకున్నారన్నారు. బ్రిటిష్‌ వారికీ వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్రోద్యమంలో విద్యార్థి ఉద్యమ నాయకుడిగానే పాల్గొన్నారన్నారు. చిన్న వయసులోనే దేశభక్తితో పాటు ప్రజల కష్టాలన్నీ తీర్చాలని, సమసమాజం రావాలనే ఉన్నత ఆశయాలను ఆయన తన మదినిండా నింపుకున్నారన్నారు. ఆంధ్ర రాష్టంలో విద్యార్థి ఉద్యమంలో, యువజనోద్యమంలో, కమ్యూనిస్టు సభ్యుడిగా, ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమంలో పేరెన్నిక గన్న నాయకుల్లో ఒకరున్నారు. కమ్యూనిస్టు పార్టీ విడిపోయిన తర్వాత 1964లో సిపిఎం తొలి పొలిట్‌ బ్యూరోలో నవరత్నాల్లో ఒకరిగా బసవపున్నయ్య ఉన్నారన్నారు. బసవపున్నయ్య ఆశించిన సమసమాజ స్థాపన కోసం, సామాజిక న్యాయం కోసం, పేదవాడికి భూమి, దేశ సంపద ప్రజలకే చెందడం అనే ఆశయాల కోసం సిపిఎంగా అందరం పునరంకితమై పని చేస్తామనిన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జెఎన్‌వి.గోపాలన్‌, బి.వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యులు ఎం.వైకుంఠరావు, పట్టణ కమిటీ సభ్యులు నాగు, చైతన్య ప్రసాద్‌, సత్యనారాయణ, బంగారు లక్ష్మి, రత్నకుమారి, త్రిమూర్తులు పాల్గొన్నారు.