Apr 23,2023 21:13

బసవేశ్వరస్వామి జయంతి సభలో మాట్లాడుతున్న విప్‌ కాపు రామచంద్రారెడ్డి

        ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌   బసవేశ్వర బోధనలను తూచా తప్పకుండా పాటించాలని విప్‌, అఖిల భారత వీరశైవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కాపు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బసవేశ్వర జయంతిని పురస్కరించుకుని ఆదివారం నగరంలో బసవేశ్వరస్వామి చిత్రపటాన్ని మేళతాళాలతో ఘనంగా ఊరేగించారు. శ్రీ పేట బసవేశ్వరస్వామి ఆలయం నుంచి సప్తగిరి సర్కిల్‌, లలిత కళాపరిషత్‌, టవర్‌ క్లాక్‌ మీదుగా శ్రీకృష్ణ కళామందిర్‌ వరకూ ఊరేగింపు సాగింది. అక్కడ సమీపంలోని బసవేశ్వర స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. అనంతరం కృష్ణ కళామందిరంలో ఏర్పాటు చేసిన సభలో విప్‌ కాపు మాట్లాడుతూ బసవేశ్వర బోధనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు. ముఖ్యంగా కష్టపడి పని చేయాలని, శ్రమకుతగ్గ ఫలితం అనుభవించాలని, పదిమందికి సహాయం చేయాలని బసవేశ్వర స్వామి సూచించారన్నారు. ఆయన బాటలోనే సిఎం జగన్‌ నడుస్తున్నారన్నారు. ముఖ్యంగా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వసతి దీవెన, విద్యాదీవన, అమ్మఒడి తదితర పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కలెక్టర్‌ ఎం.గౌతమి మాట్లాడుతూ సమాజంలో సమానత్వాన్ని, సంస్కరణలను తీసుకురావాలని పోరాటం చేసిన వారిలో బసవేశ్వరుడు చిరస్మరణీయులు అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అప్పట్లో బీసీ వర్గానికి చెందిన లింగాయత్‌లకు గుర్తింపును తీసుకొచ్చి వివక్షను అంతం చేసేందుకు కృషి చేశారన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, విద్యతోనే సమాజంలో మార్పు తీసుకు రాగలుగుతామని అప్పట్లోనే విద్యకు పెద్దపీట వేసి లింగాయత్‌లను సమన్వయం చేసుకుంటూ వారికి సమాజంలో గౌరవమైన స్థానాన్ని తీసుకోవాలని ఎంతగానో పోరాడిన వ్యక్తి బసవేశ్వరుడు అని కొనియాడారు. ఆయన బాటలోనే ప్రతి ఒక్కరు నడవాలన్నారు. ఇందులో భాగంగానే ఈబీసీల కోసం ఈబీసీ నేస్తం పథకాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. అలాగే నాడు - నేడు కింద ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్‌ కళాశాలకు దీటుగా అభివృద్ధి చేయడంతోపాటు హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు వివరించారు. ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ హైందవ మతాన్ని సంస్కరించిన ప్రముఖుల్లో బసవేశ్వరుడు ఒకరని ప్రశంసించారు. ఆయనను బసవన్న, బసవుడు అని, విశ్వగురు అని కూడా పిలుస్తారన్నారు. సమాజంలో కుల వ్యవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది అని, లింగాయత ధర్మం స్థాపించారన్నారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ సంఘ సంస్కర్త, సామాజిక తత్వవేత్త బసవేశ్వరుడి జయంతిని సిఎం జగన్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. బసవేశ్వరుడు 800 సంవత్సరాల క్రితమే కుల,వర్ణ, లింగ బేధాలు లేవని, అందరం సమానమేనని చాటి చెప్పారన్నారు. సమ సమాజ స్థాపనకు ఆయన ఎంతగానో కృషి చేశారని, ఆయన బోధనలు, వచనాలు ఈ తరానికి ఎంతోఅవసరమన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా వీర శైవ సమాజ అధ్యక్షులు ఎంజి.రాజు, ప్రధాన కార్యదర్శి సతీష్‌ కుమార్‌,కోశాధికారి మల్లికార్జున, కార్యవర్గ సభ్యులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.