Jul 03,2023 21:52

బాహాబాహీకి దిగుతున్న తెలుగుతమ్ముళ్లు

           ప్రజాశక్తి-గుత్తి   గుంతకల్లు నియోజకవర్గంలో కొన్నినెలలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. టిడిపి చేపట్టిన భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య యాత్రలో భాగంగా సోమవారం గుత్తికి వచ్చిన బస్సుయాత్రలో రెండు వర్గాలకు చెందిన విభేదాలు బహిర్గతమయ్యాయి. స్థానిక పట్టణంలోని గాంధీ కూడలిలోకి నాయకులు ప్రయాణిస్తున్న బస్సు రాగానే టిడిపి స్థానిక నాయకులు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అయితే టిడిపి రాష్ట్ర కార్యదర్శి వెంకట శివుడు వర్గీయులు కొంత సమయం బస్సు యాత్ర గుత్తిలోనే ఉంచాలని కోరారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఇంకా చెరువు కట్ట వద్ద ఉన్న టిడ్కో గృహాలను పరిశీలించాలని, గుంతకల్లు బహిరంగ సభ ఉందని మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ వర్గీయులు చెప్పారు. గుత్తిలో సమయం కేటాయించాలని వెంకటశివుడు వర్గీయులు పట్టుబట్టడంతో రెండువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నాయకులు, కార్యకర్తలు బహాబహీకి దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. తెలుగు తమ్ముళ్లు ఒకరినొకరు దూషించుకున్నారు. నాయకులు ఇరువర్గాలకు సర్ది చెప్పారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండ కట్టాల్సిన టిడిపి నాయకులు, కార్యకర్తలు బస్సు యాత్రలో తోసుకోవడం, దూషించుకోవడం పట్ల పలువురు బహిరంగంగా విమర్శిస్తున్నారు.