Jun 14,2022 22:23

బస్సులు నడపండి... సారూ....!
బస్సులు లేక అవస్థలు
ఆదాయం వస్తున్నా ఎందుకు నడపరని ప్రశ్నిస్తున్న ప్రజలు
ఆర్టీసీ అధికారులు స్పందించాలని వేడ్కోలు

ప్రజాశక్తి- వెదురుకుప్పం:
15 సంవత్సరాల క్రితం మండలంలోని పచ్చికాపలం వెదురుకుప్పం మీదుగా చిత్తూరుకి పదుల సంఖ్యలో బస్సులు తిరుగుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేవి. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులను సకాలంలో చేర్చడంతో పాటూ పల్లిపట్టు, మదనపల్లె, పలమనేరు మార్కెట్‌కు రైతులు తాము పండించిన పంటలను తీసుకెళ్లి అమ్ముకోవడానికి వీలుగా ఆర్టీసీ బస్సులు ఉండేవి. అంతేకాకుండా రైతులు, ప్రజలు వారి అవసరాల కోసం పుత్తూరు, చిత్తూరుకు ఎక్కువగా ప్రయాణించేవారు వీరికి ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేది. అయితే గత కొన్నేళ్లుగా ఆర్టీసీ నష్టాల్లో ఉందని ఈ రూట్‌లో బస్సు సర్వీసులను నిలిపేశారు. దీంతో మండల ప్రజలు ప్రయాణం చేయాలంటే నానా ఇబ్బందులు పడక తప్పడం లేదు.
1994- 2001 మధ్యకాలంలో
చిత్తూరు, పుత్తూరు బస్సు సౌకర్యలు ఇలా ఉండేవి..
ఈ కాలంలో పుత్తూరు డిపో నుంచి ఉదయం ఐదు గంటలకి మదనపల్లె బస్సు పచ్సికాపల్లంకి వచ్చేది, మండల వాసులు, రైతులు ఈబస్సుకి వెళ్ళేవారు. అలాగే నచ్సుకూరు, చిత్తూరు, పుత్తూరు, (దొంగబస్సు), అగ్గిచేనుపల్లె మీదుగా చిత్తూరు, అనుపల్లెకు ప్రతి అరగంటకు ఓ బస్సు వెదురుకుప్పం మండలం పెనుమూరు మీదుగా ప్రయాణికులను చేరవేస్తూ చిత్తూరుకు వెళ్ళేవి. ఈ మధ్యలో చిత్తూరు డిపో వారు ఈ రూట్లో రెండు బస్సులను తిపేవారు. పుత్తూరు డిపోలో రాత్రి 9.30 గంటలకి చివరి బస్సు వచ్చేది. రైతులు, విద్యార్థులు వివిధ పనులకు వెళ్ళిన వారు పనులు ముగించుకుని బస్సుల ద్వారా తిరిగి వచ్చేవారు. గతంలో ఆర్టీసీ బస్సులున్న సమయంలో ఈమార్గాలలో ప్రయాణం అంత సౌకర్యవంతంగా ఉండేది. గతంలో ఎన్నో బస్సులు ఈ రూట్లలో తిరిగేవి.
ప్రస్తుతం ఇలా...
ప్రస్తుతం వెదురుకుప్పం, పెనుమూరు మీదుగా చిత్తూరుకు వెళ్ళాలంటే ఒక్క బస్సు లేదు. ఇటు పుత్తూరుకి, అటు చిత్తూరుకు ప్రయాణికులు, విద్యార్థులు, రైతులు వెళ్లాలంటే చాలా అవస్థలు పడుతూ ఆటోలో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. ప్రస్తుతం పుత్తూరు డిపో వారు ఓ బస్సును ఉదయం, సాయంత్రం రెండు ట్రిప్పులు తిప్పుతున్నారు. అది పెనుమూరు వరకే. మంచి ఆదాయం ఉన్నా ఈరూట్లో ఎందుకు బస్సులు నడపడం లేదు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా సంబంధించి అధికారులు స్పందించి ఈ రూట్‌లో బస్సులు నడపాలని కోరుతున్నారు.
అనుమతితోనే ముందుకు వెళ్లాలి
- ప్రశాంతి, డిపో మేనేజర్‌ పుత్తూరు
పైస్థాయి అధికారుల అనుమతితోనే చిత్తూరు, పుత్తూరు వయా.. వెదురుకుప్పం పెనుమూరు మండలం బస్సులను నడపాలి. నేను వచ్చాక బస్సులు ఏమి తగ్గించలేదు. బడులు పునఃప్రారంభం అయితే అగ్గిచేనుపల్లె సర్వీసు నడుపుతాము. నేను వచ్చాక ఏ బస్సు సర్వీసును ఆపలేదు.
బస్సు సౌకర్యాం కల్పించాలి
- రవి, న్యాయవాది, వెదురుకుప్పం
వెదురుకుప్పం నుంచి పుత్తూరుకి వెళ్ళాలంటే బస్సు సౌకర్యం లేదు. ఆ రూట్‌లో చాలా మంది విద్యార్థులు, రైతులు గమ్యస్థానాలకు చేరలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నా ఒక బస్సు కూడా టైమ్‌కు రాదు. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతూ ఆటోలోనే ప్రయాణించాల్సి వస్తోంది. ఇకనైనా ఆర్టీసీ అధికారులు స్పందించాలి.