Jul 28,2022 22:13

బస్సు యాత్రను జయప్రదం చేయండి
యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌ఎస్‌ ప్రసాద్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌, చిత్తూరు జిల్లా శాఖ జిల్లా కార్యదర్శివర్గ సమావేశం చిత్తూరు యుటిఎఫ్‌ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పి.సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రాథమికవిద్యను నిర్వీర్యం చేసే విధంగా విద్యాసంస్కరణలు ఉన్నాయని, నాడు- నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు బాగుపడ్డాయి, దీనికి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుచున్న బడుగు,బలహీన వర్గాల పిల్లలకు ప్రాథమిక విద్యను దూరం చేయడం శోచనీయం, బాలికల డ్రాపౌట్స్‌ పెరిగే అవకాశం ఉన్నదని అన్నారు. అంతేకాకుండా అంగన్వాడీ వ్యవస్థ కూడా దీనివలన నిర్వీర్యం అవుతుందని పేర్కొన్నారు. విద్యాశాఖ అధికారులు ప్రాథమికవిద్య మీద ప్రయోగాలు చేయడం ద్వారా ఇప్పటికే ప్రజలు మా ఊరి బడి- మా ఊరి లోనే ఉండాలని ఉద్యమాలు చేస్తున్నారని కావున ప్రాథమిక పాఠశాలల విలీనం ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఐక్యఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులు పి.బాబురెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయులకు బదిలీలను చేపడుతుండటం హర్షించదగినది, బదిలీలలో సున్నా సర్వీసును స్వాగతిస్తున్నామని అన్నారు. గతంలో జరిగిన విధంగా బదిలీల జీవోలు విడుదల చేయాలని, ఖాళీలను బ్లాక్‌ చేయకుండా, బదిలీలకు అన్నిఖాళీలను చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కార్యదర్శి టి.రఘుపతి రెడ్డి జిల్లా ప్రధానకార్యదర్శి జీవి.రమణ, జిల్లా గౌరవాధ్యక్షులు ఎం.సోమశేఖర్‌ నాయుడు, జిల్లా సహాధ్యక్షులు పిఆర్‌.మునిరత్నం, ఎస్‌.రెహానా బేగం, కె.ప్రసన్న కుమార్‌, ఏ.కష్ణమూర్తి, గాలిసురేష్‌, టి.దక్షిణామూర్తి, దీనావతి, సీపీ.ప్రకాష్‌, ఎన్‌.మనిగండన్‌, ఎస్పీ బాషా, ఎంవీ రమణ పాల్గొన్నారు.