బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వామివారి దర్శన ఏర్పాట్లు : కలెక్టర్
బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా
స్వామివారి దర్శన ఏర్పాట్లు : కలెక్టర్
ప్రజాశక్తి- ఐరాల: స్వయంభు శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో ఈనెల 31 నుండి సెప్టెంబర్ 20వ తేదీ వరకు జరుగు స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారి దర్శనం జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ దేవస్థానం అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ రిషాశాంత్‌రెడ్డి, కాణిపాకం ధర్మకర్తల మండలి చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈఓ సురేష్‌బాబులతో కలసి దేవస్థానంలో క్యూలైన్ల నిర్వహణ, ఇతర అంశాలపై దేవస్థానం ఆవరణంలో పరిశీలించి అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 31న వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఎక్కువ మంది భక్తులు స్వామివారి దర్శనార్థం రావడం జరుగుతుందని తెలిపారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనఏర్పాట్లు చేసేందుకు పగడ్బందీగా క్యూలైన్ల నిర్వహణ చేపట్టాలని దేవస్థానం సిబ్బంది, పోలీసు శాఖ సమన్వయంతో పనిచేసి రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. దీనితో పాటు ఈనెల 31 నుండి సెప్టెంబర్ 20వ తేదీ వరకు 21 రోజులపాటు జరుగు బ్రహ్మౌత్సవాలకు సంబంధించి వివిధ ప్రాంతాల నుండి రాష్ట్రాల నుండి భక్తులు రావడం జరుగుతుందని భక్తుల రద్దీకనుగుణంగా ఇతర ఏర్పాట్లు అన్ని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీఓ రేణుక, డిఎస్పి సుధాకర్ రెడ్డి, ఆలయ ఈఈ వెంకట నారాయణ, వెస్ట్ సర్కిల్ సిఐ శ్రీనివాసులు రెడ్డి, కాణిపాకం ఎస్సై రమేష్, సంబంధిత అధికారులు, ఆలయ సి బ్బంది పాల్గొన్నారు.










