Apr 10,2023 23:13

ఆత్మకూరులోని బొప్పాయి తోట

        ఆత్మకూరు : బొప్పాయి పంటకు తెగుళ్లు సోకాయి. దీంతో దిగుబడి భారీగా తగ్గింది. కాయ పెరిగే సమయంలో తెగుళ్లు పట్టుకోవడంతో పంట మొత్తం చేతికందకుండా పోతోంది. దీనికి తోడు ధర కూడా పతనం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మండలంలోని వై.కొత్తపల్లి, సింగంపల్లి, పంపనూరు, గోరిదిండ్ల, మదిగుబ్బ తదితర గ్రామాల్లో 300 ఎకరాల్లో బొప్పాయి సాగు చేశారు. ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.80 వేలు పెట్టుబడి పెట్టి సాగు చేశారు. ఈ పంటకు వైరస్‌ మూలంగా ఆకులు ముడుచుకపోయి, పండుబారాయి. దీంతో దిగుబడి తగ్గింది. ఎకరాకు 30 టన్నులు దిగుబడి రావాల్సి ఉండగా కేవలం 10 టన్నులు మాత్రమే వస్తోంది. పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత నెలలో టన్ను రూ.18 వేలు ధర పలికింది. ప్రస్తుతం రూ.8 వేలకు పడిపోయింది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. రంజాన్‌ మాసంలో ప్రతి ఏడాది బొప్పాయి పంటకు అధిక ధరలు ఉండేవి. ఈ ఏడాది ధరలు పతనం అవడంతో రైతులకు నష్టాలు మిగిలాయి. ఇక ధరలు కూడా వ్యాపారులు నిర్ణయించిన మేరకే విక్రయించాల్సి వస్తోంది. ఒక్క ఆత్మకూరు మండలంలోనే పెట్టుబడి రూపంలో బొప్పాయి రైతులు రూ.2 కోట్ల వరకు నష్టపోతున్నట్లు తెలుస్తోంది. రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ద్వారా ఉద్యాన పంటలకు రాయితీలు అందడం లేదు. బొప్పాయికి సోకిన వైరస్‌ నిర్మూలనకు సూచనలు, సలహాలు ఇచ్చిన దాఖలాలూ కన్పించడం లేదు. ఇప్పటికైనా ఉద్యానశాఖ అధికారులు స్పందించి తెగుళ్ల నివారణకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.