బోయకొండ అభివృద్ధిలో మరో ముందడుగు
మాస్టర్ ప్లాన్ రూపొందించుటకు శ్రీకారం
ప్రజాశక్తి- చౌడేపల్లె : రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల ప్రకారం రాబోవు 40 నుంచి 50 సంవత్సరాల అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని బోయకొండకు బృహత్‌ప్రణాళిక (మాస్టర్ ప్లాన్) రూపొందించుటకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందుకు దేవదాయశాఖ వారు ఆమోదించిన అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్థ సీబీఆర్‌ఈ సౌత్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్ వారితో దేవస్థానం వారు 52ఎకరాలకు మాస్టర్‌ప్లాన్ రూపొందించుటకు ఒప్పందం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా వారు తొలిదశలో ప్రాథమిక ప్లాన్ రూపొందించి సీబీఆర్‌ఈ ప్రతినిధులు జాస్మిన్ సింగ్, ఆశిష్ గుప్తా గురువారం బోయకొండకు వచ్చి వాటిని ప్రదర్శించారు. కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి,దేవస్థాన ఛైర్మన్ మిద్దింటి శంకరనారాయణ, ధర్మకర్తలు శ్రావణి భానుప్రకాష్, ఈశ్వరమ్మ, కార్యనిర్వహణాధికారి సీబీఆర్‌ఈ ప్లాన్లను పరిశీలించి పలురకాల సూచనలిచ్చారు. దేవదాయశాఖ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు శేఖర్ ఈఈ, శ్రీనివాస్ డీఈలు పరిశీలించి సాంకేతిక సలహాలు ఇచ్చారు. ఈ ప్రతిపాదనలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి తర్వాత మార్పులు చేర్పులతో ఫైనలైజ్ చేయనున్నారు.










