అక్రమరవాణాకు కోత్త మార్గాలెంచుకున్న స్మగ్లర్‌లు
కొరవడిన అధికారుల నిఘా
ప్రజాశక్తి-ఎస్‌ఆర్‌పురం:
ఇప్పటికి వేల హెక్టార్లలో ఎర్రచందనం చెట్లు నెలకొరిగాయి. ఎర్రచందనం పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్, ప్రస్తుతం సెబ్ అధికారుల ఆదేశాలతో శేషాచలం అటవి సరిహద్దు ప్రాంతాలు, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను క్రమం తప్పకుండా తనఖీలు చేస్తున్నారు. అయినా ఇంత మంది అధికారుల కళ్ళుగప్పి ఎర్రచందనం స్మగ్లర్లు కోత్త దారుల్లో ఎర్రచందనంను గమ్యస్థానాలకు చేర్చగలుగుతున్నారు. మంగళవారం గంగాధర నెల్లూరు మండల పరిధిలోని చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారి గంగాధర నెల్లూరు నుండి బలిజి కండ్రిగవైపు తమిళనాడుకు వెళ్లే మార్గంలో కట్టకిందపల్లి మార్గమధ్యంలో రెండు నెంబర్ ప్లేట్లు కలిగిన ఏపి 03 బిఎఫ్ 1609 టిఎన్ 09 బిటి 7536 గల మహీంద్ర జైలో వాహనంలో అతి వేగంగా ప్రయాణిస్తున్న స్మగ్లర్ల వాహనం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో అదుపు తప్పి బొల్తా కొట్టింది. దీంతో అసలు బండారం బయటపడింది. ఈ ఘటనతో స్మగ్లర్లు వాహనంను విడిచి పారిపోయింటారని సిఐ బాలయ్య తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటన ప్రాంతాన్ని ఎస్‌ఐ సుమన్ పరిశీలించి స్మగ్లర్ల వాహనం నుండి 30 ఎర్రచందనం దుంగలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎర్రచందనం స్మగ్లర్‌లను పట్టుకునేందుకు జీడి నెల్లూరు ఎస్‌ఐ సుమన్, సిబ్బంది ముమ్మర చర్యలు చేపట్టారు నిందితులను త్వరలో అదుపులోకి తీసుకుంటామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.










