Sep 23,2023 09:06

'అనంత'లో జరుగుతున్న వినాయక నిమజ్జనం

        అనంతపురం ప్రతినిధి : భారీ కాయుడు... బొజ్జ గణపయ్యకు జనం భారీగానే ఖర్చు పెట్టారు. అనంతపురం జిల్లాలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరిగాయి. సాధారణంగా జిల్లాలో మూడు, ఐదు రోజుల పాటు జరుపుతారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు రోజులకే నిమజ్జనాలు పూర్తయ్యే విధంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అనంతపురం నగరం, ఇతర పట్టణాల్లో ఐదు రోజులకు అనుమతులిచ్చారు. ఐదు రోజులు పెట్టినవి శుక్రవారం నాడు నిమజ్జనం జరిగాయి. జిల్లా వ్యాప్తంగా అనుమతి తీసుకున్న వరకు ఐదు వేల వరకు విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఒక్క అనంతపురం నగరంలోనే అధికారికంగా 446 వరకు ఉండగా మరో రెండు వందల వరకు అనుమతి లేకుండా ఉన్నాయి. ఇవి కూడా ఐదవ రోజే నిమజ్జనం జరిగాయి. ఎక్కడా ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవడంతో ప్రశాంతంగా నిమజ్జనం జరిగింది.
భారీ వ్యయమే..
భారీ కాయుడి గణపయ్యకు జనం పెట్టిన ఖర్చు కూడా అధికంగానే పెట్టారు. జిల్లా వ్యాప్తంగా 3300 విగ్రహాలు జిల్లాలో ఏర్పాటయ్యాయి. ఒక్కో చోట లక్ష నుంచి పది లక్షలకు పైగా ఖర్చు అయ్యింది. తక్కువ అన్న ఒక్కో విగ్రహం ఏర్పాటు, ఇతర ఖర్చులు అన్నీ కలిపి సగటున లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యింది. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా ఈ ఐదు రోజుల విగ్రహాల ఏర్పాటుకు అయిన ఖర్చు సుమారు రూ,50 కోట్లకుపై పైమాటేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విగ్రహాల ఏర్పాటు వెనుక వి'నాయకులు'
వచ్చేది ఎన్నికల సంవత్సరం కావడంతో పెద్దఎత్తున విగ్రహాల ఏర్పాటు జరిగింది. సందు,సందుల్లోనూ విగ్రహ మంటపాలు వెళిశాయి. ఇంత పెద్ద ఎత్తున జరిగిన ఖర్చు వెనుక నాయకులున్నారన్న ప్రచారం సాగుతోంది. ఆయా ప్రాంతాల్లో యువకులను బృందాలుగా ఏర్పాటు చేసి విగ్రహాలు ఏర్పాటు చేసే విధంగా ముందస్తు ప్రణాళిక చేశారు. దీనికి కొంత వరకు ఆర్థికపరమైన తోడ్పాటును అందించారు. దీంతో గడిచిన రెండేళ్ల కంటే ఎక్కువగానే ఈసారి విగ్రహాల ఏర్పాటు జరిగింది.
డీజేల ముందు హోరెత్తిన యువత
విగ్రహాల నిమజ్జనం సమయంలో ప్రతి విగ్రహం వద్ద డీజేల సౌండ్లు దద్దరల్లాయి. ఇందులో ప్రధానంగా యువత సందడి అంతఇంతా కాదు. గతానికి భిన్నంగా పెద్దఎత్తున యువతులు కూడా పాల్గొని నృత్యాలు చేయడం గమనార్హం. అనంతపురం సాయంత్రం నుంచి రాత్రి ఒంటి గంట వరకు విగ్రహాల నిమజ్జన యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా అనంతపురం నగరంలో ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ను సైతం పోలీసులు మళ్లించారు.
'మద్యం' ఓపెన్‌
వినాయక నిమజ్జనం రోజు ఉదయం నుంచే మద్యం విక్రయాలు నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. గతంలోనూ చేసేవారు. కాని ఈసారి విక్రయాలు నిలిపివేయలేదు. ఉదయం నుంచి రాత్రి వరకు యథావిధిగా మద్యం విక్రయాలు జరిగాయి. వినాయక చవితి వేడుకల్లో పాల్గొనే యువత ఒకవైపు మందు... మరోవైపు డీజేల ముందు చిందులు వేశారు.